Rahul Gandhi Launches Sharp Criticism: అమెరికా సేవకుడిలా మోదీ ప్రవర్తన: రాహుల్ గాంధీ తీవ్ర విమర్శ
రాహుల్ గాంధీ తీవ్ర విమర్శ

Rahul Gandhi Launches Sharp Criticism: ఒమన్ తీరంలో భారతీయ నావికుల మృతి విషయంలో విచారం వ్యక్తం చేయకపోగా, భారత్‌ను ఉద్దేశించి అమెరికా జారీ చేసిన హెచ్చరికలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు.
‘ముగ్గురు భారతీయుల మృతిపై కనీసం క్షమాపణ చెప్పని అమెరికా.. తన సైనిక ఆదేశాలను తక్షణం పాటించాలని, ఎలాంటి ఉల్లంఘనలను సహించబోమని హెచ్చరిస్తోంది. సార్వభౌమాధికారం ఉన్న ఏ దేశమైనా ఇలాంటి భాషను సహించదు. కానీ ప్రధాని మోదీ విధేయ సేవకుడిలా అమెరికా ఆదేశాలను అనుసరిస్తున్నారు. రాజీపడిన వ్యక్తి భారత గౌరవాన్ని కాపాడలేడు. లోపభూయిష్టమైన ప్రధాని పాలనలో భారతీయుడిగా ఉండటం అంటే దయనీయమైన దుస్థితిని ఎదుర్కోవడమే’ అని రాహుల్ గాంధీ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో రాశారు.
భారత నావికులు మృతి చెంది మూడు రోజులు గడిచినా, వారి మృతిపై కనీసం సంతాప సందేశం లేదా బహిరంగ ప్రకటన కూడా ప్రధాని మోదీ నుంచి రాలేదని రాహుల్ ఆరోపించారు. దేశ ప్రతిష్ట, సార్వభౌమత్వాన్ని ఎంతగా దిగజార్చారో చెప్పడానికి ఇక ప్రత్యేక సాక్ష్యాలు అవసరం లేదన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఎక్స్ వేదికగా మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘జాతీయ ప్రయోజనాలను కేంద్రం రోజువారీ తాకట్టు పెడుతోంది. ‘విశ్వగురు’ అనే ప్రచారంతో నిజాలను కప్పిపుచ్చుతోంది’ అని అన్నారు.
ఈ ఘటన భారత్-అమెరికా సంబంధాలు, దేశ సార్వభౌమాధికారం విషయంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

