Rahul Gandhi Slams PM Modi: రాహుల్ గాంధీ: ఢిల్లీలో పొల్యూషన్‌పై మోదీ సైలెన్స్‌ను ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

Rahul Gandhi Slams PM Modi: ఢిల్లీలో భయంకరంగా పెరుగుతున్న వాయు కాలుష్య సమస్యపై ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రసఖ్య రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఓ వీడియో ప్రకటనలో మాట్లాడిన రాహుల్, తాను కలిసిన ప్రతి వ్యక్తి ఈ పొల్యూషన్ గురించే మాట్లాడుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతున్నారని హైలైట్ చేశారు.
"ప్రధాని గారు, మన దేశంలోని పిల్లలు మన చుట్టూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారు విషపూరిత గాలి పీల్చుకుంటూ పెరుగుతున్నారు. మీరు దీనిపై ఎందుకు మౌనంగా ఉండగలరు?" అంటూ మోదీని నేరుగా ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఢిల్లీ పొల్యూషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ప్రణాళిక లేకుండా, జవాబుదారీతనం లేకుండా ఉన్నాయని ఆరోపించారు. మన పిల్లలకు స్వచ్ఛమైన గాలి అందించడం ప్రభుత్వాల బాధ్యత అని, ఇప్పటికైనా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా, ఢిల్లీ వాయు కాలుష్యంపై పార్లమెంటులో తక్షణమే వివరణాత్మక చర్చ జరగాలని రాహుల్ డిమాండ్ చేశారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు కలిసి కఠిన కార్యాచరణ అమలు చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం మొదటి ప్రాధాన్యత అని నొక్కి చెప్పారు. ఈ వీడియో ప్రకటన దేశవ్యాప్తంగా వైరల్ అవుతూ, మోదీ ప్రభుత్వంపై విమర్శలకు దారితీస్తోంది.
రాహుల్ గాంధీ విడుదల చేసిన వీడియోలో, ఢిల్లీలోని పొల్యూషన్ దృశ్యాలు, ప్రజల ఆవేదనలు చూపించి, ప్రభుత్వాల వైఖరిని ప్రశ్నిస్తూ మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే అడుగులు వేయాలని, రాజకీయాలు మాని ప్రజల భద్రతపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

