Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని ‘దేశద్రోహి’గా అభివర్ణిస్తూ, ఆయనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నియంత్రిస్తున్నారని ఆరోపించారు. తనతో బహిరంగ చర్చకు వస్తే ఈ విషయాన్ని కేవలం ఐదు నిమిషాల్లోనే నిరూపిస్తానని సవాల్‌ విసిరారు.

బుధవారం పంజాబ్‌లోని సంగ్రూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ‘ఇన్సాఫ్‌ ర్యాలీ’లో రాహుల్‌ మాట్లాడుతూ, ‘‘నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ను దేశద్రోహి అని అంటున్నారు. కాబట్టి నేను ఆయనకు ప్రత్యక్ష సవాల్‌ విసిరాను. ఎక్కడైనా రండి, నా ఎదురుగా కూర్చుని చర్చించండి. మీకిష్టమైన జడ్జిని (మోహన్‌ భాగవత్‌ లేదా అదానీని కూడా) ఉంచుకోండి. నేను ఐదు నిమిషాల్లో మోదీ దేశద్రోహి అని, ట్రంప్‌ ఆయనను నియంత్రిస్తున్నారని నిరూపిస్తాను’’ అని అన్నారు.

పార్లమెంటులో చర్చిద్దామని ఎన్‌డీఏ నేతలు అంటున్నారని చెప్పిన రాహుల్‌, ‘‘లోక్‌సభలో నేను మాట్లాడకుండా మైక్‌ కట్‌ చేస్తారు. నన్ను మాట్లాడనివ్వరు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మూడేళ్ల గడువు పెట్టారని, అయితే అప్పటికి ఆయన పదవిలో ఉంటారో లేదో అని ఎద్దేవా చేశారు. తన అంచనా ప్రకారం ఏడాదిలోపే ప్రభుత్వం కూలిపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

రాహుల్‌ అమిత్‌ షాను ఉద్దేశించి, ‘‘అదానీ ఓడరేవులో పట్టుబడిన మాదకద్రవ్యాల సంగతేంటి? ఆ విషయంలో మీరు తీసుకున్న చర్యలేమిటి? మీరు శాంతిభద్రతల గురించి మాట్లాడుతున్నారు. మీరు గ్యాంగ్‌స్టర్లను ప్రోత్సహిస్తున్నారని దేశం మొత్తానికి తెలుసు. ఒకవేళ శాంతిభద్రతల గురించి మాట్లాడాలనుకుంటే మణిపూర్‌లో ఏం జరుగుతోందో దేశానికి చెప్పండి’’ అని ప్రశ్నించారు.

పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీపైనా రాహుల్‌ విరుచుకుపడ్డారు. డ్రగ్స్‌ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తామని భగవంత్‌ మాన్‌ ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఎక్కడా నిర్మూలించలేదని ఆరోపించారు. గతంలో లోక్‌సభలో భగవంత్‌ మాన్‌తో కలిసి కూర్చున్నప్పుడు ఆయన వద్ద మద్యం వాసన వచ్చేదని, మాదకద్రవ్యాలపై పోరాడాలంటే ముఖ్యమంత్రి మద్యం మత్తులో ఉండకూడదని చురకలు పెట్టారు.

ఈ సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సచిన్‌ పైలట్‌లు పాల్గొన్నారు.

Next Story