Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ జీవిత ప్రయాణాన్ని వివరిస్తూ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ నవంబరు 10న విడుదల కానుంది. 544 పేజీల ఈ పుస్తకాన్ని నాఫ్‌ ప్రచురణ సంస్థ హార్డ్‌కవర్‌, ఈ-బుక్‌ రూపంలో అందుబాటులోకి తీసుకురానుంది. ఆడియో ఎడిషన్‌ను పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ విడుదల చేయనుంది. తొలి ముద్రణలో లక్ష కాపీలు ముద్రించనున్నట్లు ప్రచురణకర్తలు తెలిపారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ గురువారం సోషల్‌ మీడియాలో భావోద్వేగపూరిత పోస్ట్‌ పెట్టారు. రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఎక్స్‌లో రాశారు: ‘‘అమ్మా.. నిన్ను, నాన్ననూ కలిసి చివరిసారి చూసి 35 ఏళ్లకు పైగా అయింది. నాన్న వెళ్లిపోయినప్పటి నుంచి ప్రతి సవాల్‌ను నువ్వు ఎంతో ధైర్యం, గౌరవంతో ఎదుర్కొన్నావు. నువ్వు ఎదుర్కొన్న కష్టాలు ఏంటో ప్రియాంకకు, నాకు మాత్రమే తెలుసు. వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ బహిరంగంగా చెప్పని నువ్వు ఈ కథను ప్రపంచంతో పంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. లక్షల మంది దీన్ని చదవబోతున్నందుకు నాకు గర్వంగా ఉంది. పాపా తన అందమైన సోనియాను చూసి గర్వంగా నవ్వుతూ ఉండొచ్చు.’’

ప్రియాంక గాంధీ కూడా స్పందిస్తూ తమ తల్లిదండ్రులది అద్భుతమైన ప్రేమబంధమని అన్నారు. హృదయంలోని భావోద్వేగాలకు నిజాయతీతో అక్షర రూపం ఇచ్చిన తల్లిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. సహృదయంతో వ్యవహరించే తల్లి అవసరమైన సందర్భాల్లో ధీరవనితగా మారిపోతుందని ప్రశంసించారు. ఇప్పటివరకు సోనియా గాంధీని రాజకీయ నేతగా మాత్రమే చూసినవారికి ఈ పుస్తకం ద్వారా ఆమె వ్యక్తిగత జీవితం తెలుసుకునే అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు.

సోనియా గాంధీ తాను రాసిన ఆత్మకథ గురించి మాట్లాడుతూ ‘‘నా జీవితాన్ని రాయడం అంత సులభంగా అనిపించలేదు. లోపలే దాచుకున్న అనుభవాలను బయటపెట్టాల్సి వచ్చింది’’ అని చెప్పారు. పుస్తకంలో రాజీవ్‌ గాంధీతో ప్రేమ, పెళ్లి, రాజకీయాల్లోకి ప్రవేశం, కుటుంబం వంటి కీలక ఘట్టాలను పంచుకున్నట్లు తెలిపారు. ఆమె జీవితం దేశం, కుటుంబం పట్ల ఉన్న ప్రేమకు తార్కాణంగా నిలుస్తుందని కుటుంబ సభ్యులు అభివర్ణించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story