Mohan Bhagwat: వయస్సుతో సంబంధం లేకుండా పనిని కొనసాగించాలని సంఘ్ తనను కోరింది : మోహన్ భాగవత్
పనిని కొనసాగించాలని సంఘ్ తనను కోరింది : మోహన్ భాగవత్

Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ తన పదవీ విరమణపై స్పష్టమైన వైఖరి వెల్లడించారు. సంఘ్ ఆదేశిస్తే ఎప్పుడైనా పదవి వదిలేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా పనిని కొనసాగించాలని సంఘ్ తనను కోరిందని, అందుకే ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగవత్ మాట్లాడుతూ... కులం, వర్గం ఏదైనా సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఒక హిందువే సంఘ్ చీఫ్‌గా ఉంటాడని స్పష్టం చేశారు. అలాగే, వీర్ సావర్కర్‌కు భారతరత్న పురస్కారం ఇస్తే ఆ బిరుదు ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌కు 'మంచి రోజులు' వచ్చాయా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... దాన్ని వేరే కోణంలో చూడాలని భాగవత్ చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంఘ్ కట్టుబడి ఉందని, దానికి మద్దతిచ్చిన వారందరికీ ప్రయోజనం చేకూరిందని వివరించారు. సిద్ధాంతాలపై అధికార బద్ధత, వాలంటీర్ల అంకితభావం, కృషి వల్లనే సంఘ్‌కు మంచి రోజులు వచ్చాయని ఆయన అన్నారు.
ఉమ్మడి పౌరస్మృతి (కామన్ సివిల్ కోడ్)పై మాట్లాడుతూ... అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించాలని, అది విభేదాలకు దారితీయకూడదని సూచించారు. దేశ జనాభాలో మతపరమైన అసమతుల్యత గురించి ప్రస్తావిస్తూ... మత మార్పిళ్లు, విదేశీయుల చొరబాట్లు, జనన రేటు తగ్గిపోవడం వంటివి ప్రధాన కారణాలని భాగవత్ చెప్పారు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ప్రతి కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉండాలని సూచించబడుతున్నప్పటికీ, దాన్ని పాటించాలా లేదా అనేది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక అని స్పష్టం చేశారు.

