నటుడు జయరామ్‌ను సిట్ విచారణ

Sabarimala Temple Gold Theft Case: శబరిమల ఆలయంలో బంగారు తాపడాలు, విగ్రహాల నుంచి బంగారం అదృశ్యమైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు జయరామ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది.

చెన్నైలోని ఆయన నివాసంలో ఈ విచారణ జరిగింది. అధికారిక వర్గాల ప్రకారం, ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి (Unnikrishnan Potti)తో జయరామ్‌కు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ప్రశ్నలు అడిగారు.

2019లో చెన్నైలో ఉన్నికృష్ణన్ పొట్టి నిర్వహించిన పూజల్లో శబరిమల నుంచి తీసుకొచ్చిన బంగారు తాపడాలతో జయరామ్ పాల్గొన్న వీడియోలు ఇటీవల బయటికి వచ్చాయి. ఈ నేపథ్యంలో సిట్ బృందం ఆయనను విచారించింది.

నటుడు జయరామ్‌తో పొట్టి ఎన్నిసార్లు పూజల్లో కలిసి పాల్గొన్నారు? వారి మధ్య ఏవైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా? అనే ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈ విచారణలో జయరామ్‌ను సాక్షిగా చేసే దిశగా సిట్ అడుగులు వేస్తోంది. ఆయనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు లేవని, ఆర్థిక లావాదేవీలు లేవని సిట్ స్పష్టం చేసింది.

కేరళలోని శబరిమల ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలు, గర్భగుడి తలుపుల నుంచి బంగారం అదృశ్యం కావడంపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు.

నటుడు జయరామ్ ‘కాంతార: చాప్టర్ 1’, ‘అల వైకుంఠపురములో’, ‘హాయ్ నాన్న’, ‘గుంటూరు కారం’, ‘మిరాయ్’ వంటి పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఆయనకు శబరిమల యాత్రతో దాదాపు నాలుగు దశాబ్దాల సంబంధం ఉందని తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story