కేంద్రానికి సుప్రీం సూచన

Supreme Court: సొంత ఇంటి కలలు సాకారం కాకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, అసంపూర్తిగా ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక ‘రివైవల్ ఫండ్’ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. అలాగే, ఈ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచనలు జారీ చేసింది.

జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఒక నివాస ప్రాజెక్టుకు సంబంధించిన వివాదంపై విచారణ జరిపింది. రియల్ ఎస్టేట్ డెవలపర్ల చేతిలో గృహ కొనుగోలుదారులు మోసపోకుండా, దోపిడీకి గురికాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. దేశంలో పట్టణీకరణ విధానాలకు అనుగుణంగా ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని సూచించింది.

రెరా ‘కోరలు తీసిన పులి’ కాకూడదు

రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)ను ‘కోరలు తీసిన పులి’గా మార్చొద్దని సుప్రీం కోర్టు హెచ్చరించింది. రెరాకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ట్రైబ్యునళ్లు, సమర్థవంతమైన యంత్రాంగం అందుబాటులో ఉండాలని, అప్పుడే ఆదేశాలు వేగంగా, కచ్చితంగా అమలవుతాయని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం మౌన ప్రేక్షకుడిగా ఉండకూడదని హితవు పలికింది. గృహ కొనుగోలుదారులతో పాటు ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేసింది. నిలిచిపోయిన ప్రాజెక్టులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకునేందుకు నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (NARCL) లేదా సంబంధిత సంస్థలతో కలిసి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని సుప్రీం కోర్టు సూచించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story