Shashi Tharoor to Trump: శశి థరూర్: ట్రంప్.. టారిఫ్ యుద్ధాన్ని ఆపండి: భారత-అమెరికా సంబంధాలను కాపాడాలని హెచ్చరిక
భారత-అమెరికా సంబంధాలను కాపాడాలని హెచ్చరిక

Shashi Tharoor to Trump: ప్రపంచానికి అత్యవసరమైన భారత-అమెరికా వ్యూహాత్మక సంబంధాలను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టారిఫ్ యుద్ధాన్ని ఆపాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) సూచించారు. అమెరికా న్యూదిల్లీని దూరం చేసుకుంటే క్వాడ్ కూటమి బలహీనపడుతుందని ఆయన హెచ్చరించారు. ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురించిన వ్యాసంలో ఈ విషయాలను పేర్కొన్నారు. దీని ఫలితంగా ప్రాంతీయ భద్రతలో అస్థిరత తలెత్తే అవకాశం ఉండడంతో పాటు, భారత్ రష్యా, చైనా వంటి అమెరికా వ్యతిరేక దేశాలకు దగ్గరవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యూహాత్మక స్వాతంత్య్రం అనే సార్వభౌమత్వం కావాలని అమెరికా గ్రహించాలని కోరారు.
"భారత్ కేవలం వాణిజ్య భాగస్వామి మాత్రమే కాదు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలక పాత్ర పోషిస్తున్న దేశం. న్యూదిల్లీని దూరం చేసుకుంటే క్వాడ్ కూటమి బలహీనపడే ప్రమాదం ఉంది. భారత్ త్వరలో ఈ కూటమి సమావేశాన్ని నిర్వహించనుంది. ప్రతి దేశం తన జాతీయ లాభాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇంధన సరఫరా మార్గాల ఎంపిక లేదా ఆయుధ కొనుగోళ్ల విషయంలో భారత్‌ను శిక్షించడం సముచితం కాదు. ఇవి ప్రతికూల పరిణామాలకు దారితీస్తాయి" అని శశి థరూర్ పేర్కొన్నారు.
భారత-అమెరికా సంబంధాలను మెరుగుపరచేందుకు థరూర్ కొన్ని సలహాలు ఇచ్చారు. భారత శ్రమ(Labor) మార్కెట్‌పై ప్రభావం చూపే టారిఫ్‌లను ఉపసంహరించుకోవడం, చర్చలను త్వరపరచడం, అత్యున్నత స్థాయి దౌత్య కార్యకలాపాలను పునరుద్ధరించడం వంటివి చేపట్టాలని సూచించారు.
