Sonam Wangchuk: పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఆదివారం (జూన్‌ 28, 2026) నిరాహార దీక్ష ప్రారంభించారు.

దీక్షకు ముందు సోనమ్‌ వాంగ్‌చుక్‌ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేలతో కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి నిరసనను ప్రారంభించారు. వందలాది మంది ఉద్యమకారులు, యువకులు, విద్యార్థులు జంతర్‌మంతర్‌ వద్ద చేరుకున్నారు. పలువురు రైతు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సోనమ్‌ వాంగ్‌చుక్‌ మాట్లాడుతూ, “నేను ఇక్కడ ఆనందంగా కూర్చోలేదు. పరిస్థితులు నన్ను ఈ నిరాహార దీక్షకు పూనుకునేలా చేశాయి. లద్దాఖ్‌ ఉద్యమం చేసే నేను ఇప్పుడు సీజేపీతో ఎందుకు కలిశానని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ ప్రధాన అంశం విద్య. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి, అంటే గత 40 ఏళ్లుగా విద్యా వ్యవస్థలోని సమస్యలు నాకు అత్యంత ఆత్మీయమైనవి. విద్యా వ్యవస్థలో సమస్యలపై యువత గళమెత్తినప్పుడు నేను మౌనంగా ఉండలేకపోయాను” అని పేర్కొన్నారు.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే దేశవ్యాప్తంగా రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. NEET పేపర్ లీక్‌ వంటి విషయాల్లో ప్రభుత్వం బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది.

ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు, జవాబుదారీతనం కోసం పెద్ద ఉద్యమంగా మారాలని ఉద్యమకారులు ఆశిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story