ప్రధాని మోదీని లోక్‌సభకు రావద్దని సూచించిన స్పీకర్ ఓంబిర్లా

Speaker Om Birla: లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు రహస్య ప్రణాళిక రచించినట్లు స్పీకర్ ఓంబిర్లా సంచలన వెల్లడి చేశారు. విపక్షాల తీవ్ర నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ప్రధానిని సభకు రావద్దని తాను సూచించానని ఆయన పేర్కొన్నారు. "పార్లమెంట్‌లో జరిగిన ఘటనలు అత్యంత దురదృష్టకరమైనవి. కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాను. విపక్షాల తీరు ఏమాత్రం సమర్థనీయం కాదు" అని ఓంబిర్లా వ్యాఖ్యానించారు. తనకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా, ప్రధాని భద్రతను పరిరక్షించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు. ఈ కారణంగానే మోదీ సభలో ప్రసంగించలేకపోయారని ఆయన తెలిపారు. సభకు రాకుండా ఉండటానికి అంగీకరించిన ప్రధాని, అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని లోక్‌సభ గురువారం ఆమోదించింది. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ఈ తీర్మానం పాస్ కావడం గమనార్హం. "ఇలాంటి తీర్మానంపై ప్రధాని మాట్లాడకపోవడం అసాధారణం. మోదీ సభకు అందుబాటులోనే ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఎంపీల ప్రణాళికలకు సంబంధించిన సమాచారం రావడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు" అని లోక్‌సభ వర్గాలు వెల్లడించాయి.

లద్దాఖ్ ఘర్షణపై భారత సైన్యం మాజీ చీఫ్ జనరల్ నరవణె రచించిన పుస్తకం గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తావన చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు, అమెరికాతో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష మహిళా ఎంపీలు బ్యానర్లతో ప్రధాని సీటు వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ సమయంలో మోదీ సభలో లేకపోవడంతో ఆ ఘటన జరగలేదు. ఈ పరిణామాలు పార్లమెంట్ చరిత్రలో ఒక దురదృష్టకర అధ్యాయంగా మిగిలిపోయాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story