భారత దేశంలో ఇంటర్నెట్‌ సర్వీసులంటే అందరూ జియో గురించే చెబుతారు. ఆ స్థాయిలో జియో స్తానం సంపాదించుకుంది.జియో ఎంట్రీతో టెలికం రంగంలో సంచలనంగా మారింది. తక్కువ ధరతో ఎక్కువ వేగవంతమైన ఇంటర్నెట్‌ సర్వీసులను జియో సంస్థ అందిస్తోంది. ఇప్పుడు దేశంలో జియో, భారతి టెల్‌ టాప్‌లో ఉన్నాయి. గతేడాది నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ గ్రూపునకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ అందిస్తున్న స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారతదేశంలో త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ సర్వీసులు ప్రధానంగా రూరల్‌ ఏరియాస్‌తో పాటు.. రిమోట్‌ ప్రాంతల్లోనూ వేగవంతమైన, నమ్మదగిన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే టార్గెట్‌తో రూపొందించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి ఇప్పటికే అవసరమైన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందిన స్టార్‌లింక్ సంస్థ, భారత మార్కెట్‌లో ఇప్పుడున్న సర్వీసులతో పోటీ పడుతూ కాంపిటీటివ్‌ రేట్లతో తమ సర్వీసులను అందించేందుకు సిద్ధమవుతోంది. స్టార్‌లింక్ అనేది స్పేస్‌ఎక్స్ డెవలప్‌ చేసిన శాటిలైట్ బేస్‌డ్‌ ఇంటర్నెట్ సర్వీస్‌. ఇది లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్‌ల ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ సర్వీసులు అందిస్తుంది. సంప్రదాయ బ్రాడ్‌ బ్యాండ్ సేవలకు భిన్నంగా, ఇది ఫైబర్ కేబుల్స్‌గానీ, సెల్ టవర్‌లపై గానీ ఆధారపడకుండా, ఆకాశంలో స్పష్టమైన దృశ్యం ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ అందించగలుగుతుంది. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, వ్యాపారాలకు ఈ స్టార్‌లింక్‌ సర్వీసులు గణనీయమైన ప్రయోజనం చేకూర్చనున్నాయంటున్నారు మార్కెట్‌ నిపుణులు. స్టార్‌లింక్ ఇప్పటికే 100కి పైగా దేశాల్లో సర్వీసులు అందిస్తోంది, ఇందులో భూటాన్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఈ సర్వీసులు స్టార్ట్‌ అయితే, డిజిటల్ డివైడ్‌ను తగ్గించడంలో, రిమోట్ ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు. స్టార్‌లింక్ భారతదేశంలో ఇంట్రడక్టరీ ఆఫర్‌లలో భాగంగా నెలకు 850 రూపాయలకే అన్‌ లిమిటెడ్‌ డేటా ప్లాన్‌లను అందించే అవకాశం కనిపిస్తోంది. ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ (నెలకు 80 డాలర్లు) లేదా భూటాన్‌లోని ప్లాన్‌ల (నెలకు 3వేలు-4,200 రూపాయలు)తో పోలిస్తే చాలా తక్కువ. అయితే, ఈ స్టార్టింట్ రేట్స్‌ ప్రమోషనల్ ఆఫర్‌లలో భాగంగా మాత్రమే ఉండవచ్చు, ఆ తర్వాత నెలవారీ ఛార్జీలు రూ.3 వేల నుంచి రూ.7 వేల వరకు ఉండే అవకాశం ఉంది. అయితే, స్టార్‌లింక్‌ సర్వీసులు అవసరమైన కస్టమర్లు మొదటగా స్టార్‌లింక్ హార్డ్‌వేర్ కిట్‌ను కొనాల్సి ఉంటుంది. ఇందులో శాటిలైట్ డిష్, వై-ఫై రూటర్ ఉంటాయి. ఈ కిట్ ధర ప్రపంచవ్యాప్తంగా 250-380 డాలర్లు అంటే.. మన భారతీయ కరెన్సీలో రూ.21,300 నుంచి రూ.32,400 మధ్య ఉంది. కానీ, భారతదేశంలో రూ.25 వేల నుంచి రూ.35 వేల మధ్య ఉండవచ్చని అంచనా. ఈ సింగిల్‌ టైమ్‌ ఎక్స్‌పెండిచర్‌, సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఇది భారతదేశంలో సగటున రూ.700 నుంచి రూ.1,500 రూపాయల నెలవారీ ధరతో అందుబాటులో ఉంటుంది. స్టార్‌లింక్ భారతదేశంలో 25 నుంచి 220 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఇది సాంప్రదాయ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కంటే తక్కువ లేటెన్సీ (25 మిల్లీసెకండ్లు)తో ఉంటుంది. ఈ వేగం వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, రిమోట్ వర్కింగ్ వంటి అనేక ఆధునిక అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే, స్టార్‌లింక్ శాటిలైట్‌ల సంఖ్య ప్రస్తుతం 7 వేలకు పైగా ఉన్నాయి. భారతదేశం వంటి జనాభా ఎక్కువగా ఉన్న దేశంలో సామర్థ్య పరిమితులను ఎదుర్కొనవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. స్టార్‌లింక్ భారతదేశంలో సేవలను ప్రారంభించడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుంచి తుది అనుమతి, స్పెక్ట్రమ్ కేటాయింపులు అవసరం. 2022లో, స్టార్‌లింక్ అనుమతులు లేకుండా ప్రీ-ఆర్డర్‌లను స్వీకరించడంతో ప్రభుత్వం దానిని నిలిపివేసింది. ఇటీవల.. మణిపూర్ వంటి ప్రాంతాల్లో స్టార్‌లింక్ పరికరాలను అక్రమంగా ఉపయోగించడంతో భద్రతా ఆందోళనలు తలెత్తాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు స్టార్‌లింక్ భారత ప్రభుత్వ సేఫ్టీ కండిషన్స్‌ను అంగీకరించింది. భారతదేశంలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో వంటి ప్రముఖ టెలికాం సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యాలు స్టార్‌లింక్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడనున్నాయి. అయితే, భారతీ ఎంటర్‌ప్రైజెస్ మద్దతుగల యూటెల్‌సాట్ వన్‌ వెబ్, జియో-ఎస్‌ఈఎస్ జాయింట్ వెంచర్ వంటి పోటీదారులు కూడా మార్కెట్‌లో ఉన్నారు. అమెజాన్ ప్రాజెక్ట్ కైపర్ కూడా భారతదేశంలో సేవలను ప్రారంభించేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. స్టార్‌లింక్ సేవలు భారతదేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరచవచ్చు, ఇది డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. అయితే, ఎక్కువ హార్డ్‌వేర్ ఖర్చు, సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పోలిస్తే అధిక నెలవారీ ఛార్జీలు సామాన్య వినియోగదారులకు అడ్డంకిగా ఉండవచ్చు. స్టార్‌లింక్ భారతదేశం కోసం ప్రత్యేక ధరల వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది, తద్వారా ఇది ధర-సున్నితమైన మార్కెట్‌లో పోటీపడగలదు.




Politent News Web4

Politent News Web4

Next Story