Starlink services with 7,000 Leo satellites

స్పేస్‌ ఎక్స్‌ యజమాని ఎలాన్ మస్క్‌కు చెందిన వెబ్‌ సర్వీసెస్‌ కంపెనీ స్టార్‌లింక్ భారతదేశంలో ఇంటర్నెట్ సర్వీసులు అందించబోతోంది. దీనికి అవసరమైన అనుమతులను భారత టెలికాం డిపార్ట్‌మెంట్‌ జారీచేసింది. స్పేస్‌ఎక్స్ శాటిలైట్స్‌ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ అందించనుంది. భారతదేశంలో మొదటి సారి ఈ తరహా శాటిలైట్ కమ్యూనికేషన్ (సాట్‌కామ్) సర్వీసులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అవసరమైన లైసెన్స్‌ కూడా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ జారీ చేసింది. స్టార్‌లింక్‌కు భారతదేశ టెలికమ్యూనికేషన్స్ విభాగం నుండి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ లైసెన్స్ లభించింది. ఇప్పటి వరకు మన దేశంలో యూటెల్‌సాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కు మాత్రమే ఇలాంటి లైసెన్స్‌లు ఉన్నాయి. స్టార్ లింక్‌ ఈ లైసెన్స్ పొందిన మూడవ సంస్థగా నిలిచింది. 2025 మే 7న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ నుంచి స్టార్‌లింక్‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయింది. భద్రతా నిబంధనలు, డేటా సెక్యూరిటీ, జాతీయ భద్రతా మార్గదర్శకాలను పాటిస్తామని స్టార్‌లింక్ హామీ ఇచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఈ లైసెన్స్‌ జారీ చేసింది. మరికొన్ని అంశాల్లో మార్గదర్శకాలను పాటించడంతో పాటు.. షరతులను అమలు చేయడం, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుండి అదనపు అనుమతులు స్టార్ లింక్ పొందాల్సి ఉంటుంది.



అయితే, ఇప్పటికే స్టార్‌ లింక్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈయేడాది మార్చిలో, రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌తో స్టార్‌ లింక్ సంస్థ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యాలు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి నగర, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ కవరేజ్‌ను మెరుగుపరచడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. జియో, ఎయిర్‌టెల్ కూడా తమ రిటైల్ స్టోర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా స్టార్ ‌లింక్ సర్వీసులను అందించనున్నాయి. వీరి మార్కెట్ వాటా కలిపి భారత టెలికాం మార్కెట్‌లో 70 శాతం కంటే ఎక్కువగా ఉంది. శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను అందించడానికి స్టార్‌లింక్ సంస్థ సుమారు 7,000 లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్‌లను ఉపయోగించనుంది. అధిక-వేగం, తక్కువ లేటెన్సీ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించనుంది. సాంప్రదాయ జియోస్టేషనరీ శాటిలైట్‌లకు భిన్నంగా, లియో శాటిలైట్‌లు 550 కి.మీ ఎత్తులోనే ఉంటాయి, లేటెన్సీని తగ్గిస్తాయి. అలాగే, స్ట్రీమింగ్, గేమింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి సర్వీసులకు ఈ ఇంటర్నెట్ బాగా ఉపయోగకరంగా మారనుంది. ఇది పూర్తి వైర్ లెస్ సర్వీస్‌. సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ కేబుల్స్‌, సర్వీసులు అందుబాటులో లేని గ్రామీణ, రిమోట్‌ ఏరియాలకు కూడా ఈ శాటిలైట్‌ వెబ్‌ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.



ఇక, స్టార్‌లింక్‌ సర్వీసులు పొందాలనుకునేవాళ్లు మొదటగా స్టార్‌ లింక్‌ కిట్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ కిట్‌ ఉంటేనే మనకు ఆ కంపెనీ సర్వీసులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. స్టార్ లింక్‌ కిట్‌లో శాటిలైట్ డిష్, వై-ఫై రూటర్, కేబుల్స్, పవర్ సప్లై సాకెట్స్‌ ఉంటాయి. ఈ కిట్ రూ.30వేల నుంచి రూ.50 వేల వరకూ ధర ఉండే అవకాశం ఉంది. నెలావారీ ఇంటర్నెట్ చార్జీలు కూడా ఇప్పుడున్న సర్వీసుల కంటే ఎక్కువగా ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి. వైర్లు లేకుండా చిన్న శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ సర్వీసులు మనదేశంలో మరో యేడాదిలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. భారత దేశంలో స్టార్ లింక్ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన ట్రయల్ స్పెక్ట్రమ్‌ను దరఖాస్తు చేసిన 15 నుంచి 20 రోజుల్లోగా మంజూరు చేస్తామని టెలికాం శాఖ ప్రకటించింది. స్టార్‌ లింక్ ఇప్పటికే 125 దేశాల్లో ఈ తరహా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు అందిస్తోంది. ప్రస్తుతం దేశంలో చాలావరకు సంప్రదాయ ఇంటర్నెట్ సర్వీసులు వైర్ లెస్ లేదా ఫైబర్ కేబుల్స్‌ ఆధారంగా అందిస్తున్నాయి. ఇవి భూమికి సుదూరంగా భూ స్థిర కక్ష్యలో ఉండే ఉపగ్రహాలపై ఆధారపడి పని చేస్తున్నాయి. స్టార్ లింక్ సంస్థ తక్కువ ఎత్తులో ఉండే కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సర్వీసులను అందించనుంది. ప్రస్తుతం స్టార్‌లింక్‌కు చెందిన 6వేల శాటిలైట్లు భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్నాయి. స్టార్‌లింక్ అందించే ఇంటర్నెట్ స్పీడ్‌ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రారంభంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగం 100-200 MBPS వరకు ఉంటుందని, భవిష్యత్తులో ఇది 600-700 GBPS బ్యాండ్‌ విడ్త్‌తో అత్యధిక వేగాన్ని అందిస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.




Politent News Web4

Politent News Web4

Next Story