పాక్‌పై భారత ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

Indian MP’s Sharp Remarks on Pakistan: అంతర్జాతీయ సమావేశాల్లో పాకిస్తాన్‌కు మరోసారి భారత్‌ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాయుధ ఘర్షణల్లో చిన్నారుల హక్కుల రక్షణకు సంబంధించి ఐక్యరాజ్యసమితి (UN) అజెండాను ఉల్లంఘించిన ఆరోపణలకు భారత ఎంపీ నిషికాంత్ దూబే తీవ్రంగా ప్రతిస్పందించారు. చిన్నారుల రక్షణపై పాక్ ఉపన్యాసాలు చెప్పకుండా ముందు తమ అద్దంలో చూసుకోవాలని భాజపా ఎంపీ సెటైర్‌లతో దుయ్యబట్టారు.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో చిన్నారుల హక్కుల రక్షణపై జరిగిన చర్చలో భారత్ తరపున మాట్లాడిన నిషికాంత్ దూబే, పాక్ దాయాది తీరును బహిర్గతం చేశారు. 'పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి అజెండాను తీవ్రంగా ఉల్లంఘిస్తోంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల తమ దేశంతో పాటు పొరుగు దేశాల్లోని చిన్నారులపైనా దాడులకు గురవుతున్నారు. అఫ్గానిస్తాన్, భారత్‌లో స్కూళ్లు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని పాక్ చేస్తున్న దాడుల వల్ల ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అనేకులు వికలాంగులుగా మారుతున్నారు' అంటూ దూబే మండిపడ్డారు.

ఇలాంటి హీనమైన చర్యలు చేస్తూ చిన్నారుల రక్షణపై అంతర్జాతీయ వేదికల్లో మాట్లాడటం పాక్‌కు హాస్యాస్పదమే అని ఎంపీ విమర్శించారు. 'ఇకనైనా ఉపన్యాసాలు ఆపేసి పాకిస్తాన్ ముందు అద్దంలో చూసుకోవాలి. తమ దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను ముందు ఆపాలి' అని తీవ్రంగా చురకలంటించారు.

ఈ సందర్భంగా 'ఆపరేషన్ సిందూర్' గురించి కూడా నిషికాంత్ దూబే ప్రస్తావించారు. భారత్‌లోని పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు మతం పేరిట చేసిన మారణహోమాన్ని అంతర్జాతీయ సమాజం ఎప్పటికీ మరచదని చెప్పారు. ఆ దారుణ ఘటనలకు పాల్పడినవారికి పాఠం నేర్పడానికే ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టామన్నారు. 'ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా ప్రజలను రక్షించుకునే చట్టబద్ధ హక్కును భారత్ వాడుకుంది' అని భాజపా ఎంపీ స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story