Strong Protest Over Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుపై తీవ్ర నిరసన: ‘బ్లాక్ బిల్లు’ అంటూ కాపీని తగలబెట్టిన స్టాలిన్
‘బ్లాక్ బిల్లు’ అంటూ కాపీని తగలబెట్టిన స్టాలిన్

Strong Protest Over Delimitation Bill: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ బిల్లు కాపీని తగలబెట్టి తన నిరసనను నమోదు చేశారు. దీన్ని ‘బ్లాక్ బిల్లు’గా అభివర్ణించిన స్టాలిన్, ఈ చట్టం దక్షిణ రాష్ట్రాలకు, ముఖ్యంగా తమిళనాడుకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు.
గురువారం (ఏప్రిల్ 16, 2026) నామక్కల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టాలిన్ పర్యటించారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నల్ల దుస్తులు ధరించి, నల్ల జెండాను ఎగరవేశారు. అనంతరం బిల్లు కాపీని తగలబెట్టి తీవ్ర నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘కలిసి పోరాడదాం.. గెలుద్దాం’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
స్టాలిన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ ఘటన వీడియోను పోస్ట్ చేశారు. “ప్రతిఘటన జ్వాలలు తమిళనాడు అంతా వ్యాపించాలి. ఇవి భాజపా అహంకారాన్ని అణచివేయాలి” అని రాశారు. 1960లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, “ఆ జ్వాల దిల్లీని దహించివేసింది. దిల్లీ దిగొచ్చిన తర్వాతే పరిస్థితి శాంతించింది” అని పేర్కొన్నారు.
ఈ బ్లాక్ బిల్లు తమిళులను తమ సొంత గడ్డపైనే శరణార్థులుగా మార్చాలని చూస్తోందని స్టాలిన్ ఆరోపించారు. దక్షిణ రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణలో క్రమశిక్షణ పాటించాయని, దానికి బహుమతిగా రాజకీయ శక్తిని తగ్గించాలని చూస్తున్నారని విమర్శించారు. లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ నిరసన చేపట్టారు.
డీలిమిటేషన్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు పెరిగి, దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని దక్షిణాది నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టాలిన్ ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేసి, భారీ ప్రతిఘటనకు పిలుపునిచ్చారు. ఈ అంశంపై దక్షిణ రాష్ట్రాలు ఏకమై పోరాడాలని కూడా ఆయన సూచించారు.

