Sukhbir Badal: శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీని ఇటీవల కలిసిన ఆయన.. తమ పార్టీ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపారు.

అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే నిష్పక్షపాత, న్యాయమైన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అన్ని రాష్ట్రాల్లో సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సమర్థించారు.

మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనను తక్షణమే చేపట్టాలని శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు పేర్కొన్నారు. తమ పార్టీ సిక్కుల బోధనల నుంచి స్ఫూర్తి పొందిందని.. మహిళల గౌరవం, సమానత్వం, సమాన హక్కుల కోసం సిక్కు గురువులు పోరాడారని చెప్పారు. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ సభలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఇప్పటికే తమ పార్టీ అందరికీ ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మద్దతు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. లోక్‌సభలో శిరోమణి అకాలీ దళ్‌కు ఒక స్థానం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story