Menstrual Leave Petition: సుప్రీం కోర్టు నెలసరి సెలవు పిటిషన్‌ను తిరస్కరించింది: మహిళల ఉద్యోగ అవకాశాలకు భంగం వాటిల్లుతుందని హెచ్చరిక
మహిళల ఉద్యోగ అవకాశాలకు భంగం వాటిల్లుతుందని హెచ్చరిక

Menstrual Leave Petition: నెలసరి (మెన్స్ట్రువల్) సెలవును తప్పనిసరి చేస్తే మహిళల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాంటి చట్టం వచ్చిన వెంటనే కంపెనీలు, సంస్థలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడం మానేసే అవకాశం ఉందని గట్టిగా హెచ్చరించింది.
శుక్రవారం ఈ అంశంపై విచారణ జరిగింది. నెలసరి సెలవుకు సంబంధించిన నియమాలను రూపొందించేలా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, ‘‘అలాంటి తప్పనిసరి సెలవు చట్టం వస్తే పురుషుల కంటే మహిళలు తక్కువ సామర్థ్యం కలిగినవారనే భావన ఉద్యోగ దాతల్లో ఏర్పడుతుంది. రుతుక్రమం అంశంపై అవగాహన కల్పించడం ఒకటి, దాన్ని సెన్సేషనల్‌గా చేయడం మరొకటి. సంస్థల యాజమాన్యాల మనస్తత్వం మీకు తెలియదు. అలాంటి చట్టం వచ్చిన మరుక్షణం ఎవరూ మహిళలను నియమించుకోరు’’ అని పిటిషనర్‌ను ఉద్దేశించి అన్నారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎంఆర్ షంషద్ వాదనలు వినిపించారు. 2013లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినులకు నెలసరి సెలవు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఇలాంటి సౌలభ్యం కల్పించాయని తెలిపారు. అయితే, కోర్టు దీనిపై స్పందిస్తూ అవన్నీ స్వచ్ఛందంగా తీసుకున్న చర్యలేనని, తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్‌కు హాని జరుగుతుందని పునరుద్ఘాటించింది.
గతంలోనూ ఈ అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘నెలసరి సెలవులు ఇవ్వడం వల్ల మహిళలు ఉద్యోగాల్లోకి ఎక్కువగా రావచ్చు. కానీ, యజమానులపై బలవంతం చేస్తే ప్రతికూల పరిణామాలు ఉంటాయి. మహిళలను నియమించుకునే అవకాశాలు తగ్గిపోవచ్చు. మహిళల ప్రయోజనాల కోసం చేసే కొన్ని ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారవచ్చు’’ అని ధర్మాసనం అప్పట్లో వ్యాఖ్యానించింది.
నెలసరి సెలవు విషయంలో అవగాహన, స్వచ్ఛంద చర్యలు మాత్రమే సరైన మార్గమని కోర్టు సూచించినట్లుగా కనిపిస్తోంది. ఈ తీర్పు మహిళల ఉపాధి, ఆరోగ్యం, సమానత్వం అంశాలపై చర్చను మరింత ఊపందుకునే అవకాశం ఉంది.

