క్రైస్తవ మతం స్వీకరించినవారికి ఎస్సీ హక్కులు లేవు

Supreme Court of India: మతమార్పిడి అనంతరం అట్రాసిటీ చట్టం కింద కేసులపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారిన వ్యక్తులు ఎస్సీ హక్కులు పొందలేరని స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఈ హక్కులకు అర్హులని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది.

బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్వహించడంపై స్థానికులు అక్కల రామిరెడ్డి సహా ఇతరులు అభ్యంతరం తెలిపారు. వారిపై అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయగా, ఆ కేసును రద్దు చేయాలంటూ రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. చింతాడ ఆనంద్ పాస్టర్‌గా పని చేస్తున్నందున అతడు క్రైస్తవ మతానికి చెందినవాడని, రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు సంబంధం లేదని న్యాయవాదులు వాదించారు. పుట్టుకతో హిందువైనా క్రైస్తవం స్వీకరించడంతో ఎస్సీ స్థాపన కోల్పోతాడని, అందువల్ల అట్రాసిటీ చట్టం వర్తించదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

హైకోర్టు ఈ వాదనలను అంగీకరించి తీర్పు ఇచ్చింది. క్రైస్తవ మతంలో కులవ్యవస్థ లేదని, హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందినవారికి మాత్రమే ఎస్సీ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ పాస్టర్ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిస్‌ అంజరియా ధర్మాసనం విచారణ చేపట్టి హైకోర్టు తీర్పును పూర్తిగా సమర్థించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోని వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని, మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా పని చేస్తున్న వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎలాంటి రక్షణ లభించదని స్పష్టం చేసింది. కుల సర్టిఫికెట్ ఉన్నప్పటికీ చట్టం వర్తించదని, సర్టిఫికెట్ ఉందని మాత్రం రక్షణ కల్పించలేమని ధర్మాసనం అన్నది.

పాస్టర్ ఆనంద్ దశాబ్దకాలంగా క్రైస్తవ మతంలో ఉన్నారని, తిరిగి హిందూ మతంలోకి మారలేదని కోర్టు గమనించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా మతమార్పిడి సంబంధిత కేసులపై ప్రభావం చూపనుంది.

Updated On 24 March 2026 4:31 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story