కోళ్లు, మేకలకు ప్రాణాలు లేవా?

Supreme Court Questions: వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్కల రక్షణ కోసం ఎన్నో పిటిషన్లు దాఖలవుతుంటే, ఇతర జంతువుల గురించి ఎందుకు ఆలోచించరని ప్రశ్నించింది. ‘‘కోళ్లు, మేకలవి ప్రాణాలు కావా? వాటి జీవితాల గురించి ఎవరూ మాట్లాడరేందుకు?’’ అని కుక్కల పక్షాన వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ను ధర్మాసనం నిలదీసింది.

వీధి కుక్కలు కరవడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ‘‘కుక్క ఏ మూడ్‌లో ఉందో, అది కరవబోతోందా లేదా అనేది దగ్గరకు వెళ్లేంతవరకు తెలియదు’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సమస్యకు చికిత్స కంటే నివారణే ముఖ్యమని స్పష్టం చేసింది.

రోడ్లపై, పాఠశాలలు, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్ల వంటి ప్రజా ప్రదేశాల్లో వీధి కుక్కల వల్ల జరుగుతున్న ప్రమాదాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కుక్కకాట్లు పెరిగిపోతున్న తరుణంలో, వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు (స్టెరిలైజేషన్) తప్పనిసరిగా చేయాలని అధికారులను ఆదేశించింది.

కపిల్ సిబల్ స్పందిస్తూ... ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు టీకాలు వేయడం, స్టెరిలైజ్ చేయడం, షెల్టర్లు నిర్మించడం వంటి చర్యలతో వీధి కుక్కల సమస్యను నియంత్రిస్తున్నాయని వివరించారు. అయితే భారత్‌లో ఈ పద్ధతులు సరిగ్గా అమలు కాకపోవడం, వీధుల్లో చెత్త రాశులు పేరుకుపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జంతు సంక్షేమ సంస్థల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కాలిన్ గోన్సాల్వ్స్... ప్రభుత్వ నివేదికలు కుక్కకాట్ల సంఖ్యను అతిశయోక్తిగా చూపిస్తున్నాయని ఆరోపించారు. 2021 నుంచి 19 రాష్ట్రాల్లో రేబిస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.

వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతోంది. మానవ జీవన భద్రతతోపాటు జంతు హక్కుల సమతుల్యత కోసం సమగ్ర పరిష్కారాలు అవసరమన్న సంకేతాలు ఈ వ్యాఖ్యల నుంచి స్పష్టమవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story