Karur Stampede Victims: కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. ఈ నియామకాలు చెల్లవని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే విధించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పిటిషన్‌దారులకు నోటీసులు జారీ చేసింది.

సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘తొక్కిసలాట జరిగి ప్రజలు చనిపోయారు. ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక పరిహారం అందించాలని నిర్ణయించింది. అలాంటప్పుడు వారికి ఉద్యోగం ఇవ్వడాన్ని ప్రశ్నించడం సమంజసమేనా? ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందుకు మీరెవరు? ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే… ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరా ఇవ్వకూడదా? కుమార్తె లేదా కుమారుడికి ప్రభుత్వాలు ఉపాధి కల్పించకూడదా?’’ అని పిటిషన్‌దారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

గతేడాది సెప్టెంబరులో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కరూర్‌లో విజయ్ టీవీకే పార్టీ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించారు. జులై 10న కరూర్‌లో పర్యటించి అర్హులైన వారికి నియామక పత్రాలు అందజేశారు.

ఈ నియామకాలపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జులైలో విచారణ జరిపిన హైకోర్టు ‘‘ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పంచిపెట్టేది కాదు. దాన్ని కష్టపడి సాధించాలి. ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలి’’ అని పేర్కొంటూ నియామకాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా… తాజాగా స్టే లభించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story