Supreme Court Warning: సుప్రీం కోర్టు హెచ్చరిక: వీధి కుక్కల దాడులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రాలకు భారీ పరిహారం
రాష్ట్రాలకు భారీ పరిహారం

Supreme Court Warning: వీధి కుక్కల (స్ట్రే డాగ్స్) సమస్యపై సుప్రీం కోర్టు మరోసారి కఠిన స్థాయిలో హెచ్చరించింది. ఈ అంశంపై మంగళవారం జరిగిన విచారణలో అత్యున్నత న్యాయస్థానం.. కుక్కల బెడదను అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది.
ప్రతి కుక్క కాటుకు, దాడి వల్ల జరిగిన ప్రతి మరణానికి గానూ రాష్ట్రాలే బాధ్యత వహించాలని, బాధితులకు పరిహారం చెల్లించాల్సిందేనని కోర్టు పేర్కొంది. కుక్క కాటు ప్రభావం బాధితుడి జీవితకాలం మీద ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ధర్మాసనం గుర్తుచేసింది.
వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వ్యక్తులు, సంస్థలపైనా కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "మీకు కుక్కలపై అంత ప్రేమ ఉంటే వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి. వీధుల్లో ప్రజలను భయపెట్టే పరిస్థితిని మేం ఆమోదించబోం. ఏదైనా సంస్థ ఆహారం పెట్టిన కుక్కల దాడిలో చిన్నారి మరణిస్తే.. ఆ ప్రాణ నష్టానికి ఆ సంస్థ బాధ్యత వహించదా?" అని న్యాయమూర్తులు ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, క్రీడా సముదాయాలు వంటి బహిరంగ ప్రదేశాల సమీపంలోని కుక్కలను స్టెరైలైజేషన్, వ్యాక్సినేషన్ తర్వాత షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాల అమలులో రాష్ట్రాలు విఫలమవుతున్నాయని కోర్టు మండిపడింది.
ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 20న కొనసాగనుంది. ఇంతలోనే రాష్ట్రాలు తక్షణమే సమగ్ర చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు సూచించింది. వీధి కుక్కల సమస్యను భావోద్వేగంతో కాకుండా, ప్రజల భద్రతను ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

