Assam CM Himanta Biswa Sarma’s Sensational Remarks: బంగ్లాదేశ్‌కు 'శస్త్రచికిత్స' అనివార్యమే: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు

Assam CM Himanta Biswa Sarma’s Sensational Remarks: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌తో దౌత్య సంబంధాలకు సమయం అయిపోయిందని, ఇక శస్త్రచికిత్స (సర్జరీ) తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో హిమంత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
"భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన 'చికెన్స్ నెక్' ప్రాంతం గురించే మన ఆందోళన. దౌత్యం, ఇతర మార్గాల ద్వారా 20-22 కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ రక్షించుకోవాలి. ఔషధాలు పనిచేయనప్పుడు శస్త్రచికిత్స అవసరం అవుతుంది" అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.
బంగ్లాదేశ్‌లో పరిస్థితి అస్థిరంగా ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ గతంలో చైనా పర్యటన సందర్భంగా చికెన్స్ నెక్ ప్రాంతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "భారత ఈశాన్య రాష్ట్రాలను 'సెవెన్ సిస్టర్స్' అంటారు. అవి బంగ్లాదేశ్‌తో చుట్టుముట్టబడి ఉన్నాయి. సముద్ర మార్గానికి మేమే రక్షకులం. ఇది చైనాకు భారీ అవకాశం" అని యూనస్ అప్పట్లో అన్నారు.
చికెన్స్ నెక్ అంటే ఏమిటి?
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతంలో ఉన్న ఈ కారిడార్, భారత ముఖ్య భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో (అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర) కలుపుతుంది. ఈ ప్రాంతం కేవలం 22 కి.మీ. వెడల్పు మాత్రమే ఉండటం వల్ల భద్రతా దృష్ట్యా కీలకం. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు దగ్గరలో ఉండటం, చైనా నియంత్రణలోని చుంబీ వ్యాలీకి సమీపంలో ఉండటం వల్ల ఇది ఎల్లప్పుడూ ఆందోళనకరం.
ఈ ప్రాంతంపై దాడి జరిగితే ఈశాన్య రాష్ట్రాలు భారత్ నుంచి విడిపోయే ప్రమాదం ఉందని సైన్య నిపుణులు దశాబ్దాలుగా హెచ్చరిస్తున్నారు. 2017లో డోక్లాం వివాదంలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతకు ఇది ఒక కారణం.
బంగ్లాదేశ్‌లోని తాజా అల్లర్లు, మైనారిటీలపై దాడుల నేపథ్యంలో హిమంత వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. భారత భద్రతకు సంబంధించి ఈ ప్రాంతం ఎంత కీలకమో ఆయన మరోసారి గుర్తు చేశారు.

