సీఎంగా సువేందు అధికారి

Suvendu Adhikari: భాజపా శాసనసభా పక్ష నేతగా సువేందు అధికారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోల్‌కతాలో అమిత్ షా సమక్షంలో జరిగిన భాజపా శాసనసభా పక్ష సమావేశంలో ఈ ప్రకటన చేశారు. సమావేశం అనంతరం అమిత్ షా స్వయంగా సువేందును బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించారు. రేపు (మే 9) బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.
కౌన్సిలర్ స్థాయి నుంచి ఉన్నత శిఖరాల వరకు...
సువేందు అధికారి 1970 డిసెంబరు 15న తూర్పు మేదినీపుర్ జిల్లాలోని కర్కులీలో జన్మించారు. ఎంఏ పట్టా పొందారు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న సువేందు తండ్రి సిశిర్ అధికారి ఎమ్మెల్యే, ఎంపీగా, యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు.
1995లో కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్‌గా రాజకీయ ప్రవేశం చేశారు. 1998లో తండ్రితో కలిసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. 2006లో కొంటాయీ (దక్షిణ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, అదే సంవత్సరం కొంటాయీ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు.
నందిగ్రామ్ ఉద్యమం.. మమతకు సన్నిహితుడు...
2007లో నందిగ్రామ్‌లో సెజ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో సువేందు ముందుండి నాయకత్వం వహించారు. ఉద్యమ విజయంతో జంగల్ మహల్ ప్రాంతానికి టీఎంసీ ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2009లో తమ్లుక్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2016లో నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మమతా మంత్రివర్గంలో చేరారు.
టీఎంసీని వీడి భాజపాలో చేరిక...
2017లో ముకుల్ రాయ్ టీఎంసీని వీడిన తర్వాత సువేందు ప్రభావం పెరిగింది. మమత తర్వాత నంబర్-2గా భావించినా, మమతా తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సువేందుకు నచ్చలేదు. శారదా కుంభకోణం ఆరోపణలు కూడా ఎదుర్కొన్న నేపథ్యంలో 2020 చివర్లో టీఎంసీని వీడి భాజపాలో చేరారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఈ ఎన్నికల్లో భవానీపుర్‌లో మమతాను మరోసారి ఓడించిన సువేందు, ఇప్పుడు బెంగాల్‌లో భాజపా తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు.

