Mahua Moitra: కష్టకాలంలో సువేందు నాకు మద్దతుగా నిలిచారు: మహువా మోయిత్రా ప్రశంసలు
మహువా మోయిత్రా ప్రశంసలు

Mahua Moitra: పశ్చిమబెంగాల్‌లో రాజకీయ సంక్షోభం నడుమ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా తన పాత సహచరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారిని ప్రశంసించారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహువా తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ, సువేందు తన కష్టకాలంలో మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో టీఎంసీ టికెట్ ఆశించిన మహువా, అది రాకపోవడంతో రాత్రంతా ఏడుస్తూ ఉండగా సువేందు అధికారి తన పక్కన ఉండి ఓదార్చారని ఆమె తెలిపారు. టీఎంసీలో కలిసి పని చేసిన కాలంలో వ్యక్తిగత స్థాయిలో మంచి సంబంధాలు ఉండేవని, సువేందు తనకు మద్దతు ఇచ్చేవారని చెప్పారు. 2016లో కరీమ్‌పూర్ నుంచి తొలిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు సువేందు తప్ప సీనియర్ నాయకులెవరూ తన కోసం ప్రచారం చేయలేదని మహువా గుర్తు చేసుకున్నారు. సువేందుకు తాను రుణపడి ఉంటానని ఆమె అన్నారు.
సువేందు అధికారి 2020లో టీఎంసీ నుంచి బీజేపీలోకి వెళ్లిన తర్వాత వారిద్దరూ తిరిగి కలుసుకోలేదని మహువా స్పష్టం చేశారు. అయితే, పార్టీలకు అతీతంగా వ్యక్తిగత సంబంధాలు ఉంటాయని ఆమె హైలైట్ చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమికి అసమర్థులకు సీట్లు ఇవ్వడమే కారణమని కూడా మహువా వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. మమతా బెనర్జీ ప్రత్యర్థి సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో మహువా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంపాదించాయి.

