2,900 కిలోల పేలుడు సామగ్రి స్వాధీనం

జమ్మూకశ్మీర్ పోలీసుల భారీ విజయం.. 8 మంది అరెస్టు

ముగ్గురు వైద్యులు.. జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ లింకులు

హరియాణా, యూపీలో సోదాలు.. చైనీస్ పిస్టల్స్, ఏకే రైఫిళ్లు పట్టివేత

పాక్ హ్యాండ్లర్లతో ఎన్‌క్రిప్టెడ్ ఛానెళ్లు.. నిధుల సేకరణ ముసుగులో

Terror Module Busted: జమ్మూకశ్మీర్ పోలీసులు హరియాణా పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్‌ను గుట్టురట్టు చేశారు. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు వైద్యులు ఉన్నారు. భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రితోపాటు 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

అక్టోబరు 19న శ్రీనగర్‌లోని బన్‌పొరా నౌగామ్ ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జైషే మహమ్మద్ పోస్టర్లు వెలిశాయి. ఈ ఘటనపై ఉపా చట్టం సహా సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశాం. దర్యాప్తులో ఉగ్రవాద భావజాలం కలిగిన విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌తో కూడిన ఓ ఉగ్రవ్యవస్థ వెలుగుచూసింది. ఈ బృందానికి పాకిస్థాన్, ఇతర దేశాల నుంచి పనిచేస్తున్న హ్యాండ్లర్లతో సంబంధాలున్నాయి.

సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో నిధులు సేకరించారు. వ్యక్తుల్లో తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించి ఉగ్రసంస్థల్లో చేర్పించడం, లాజిస్టిక్స్ ఏర్పాటు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఐఈడీల తయారీకి అవసరమైన పదార్థాల సేకరణలో పాల్గొన్నట్లు గుర్తించాం. ఈ కార్యకలాపాల సమన్వయం కోసం ఎన్‌క్రిప్టెడ్ ఛానెళ్లను ఉపయోగించారు.

వైద్యుల అరెస్టు.. భారీ ఆయుధ డంప్

అరెస్టైన వైద్యుల్లో కుల్గాంకు చెందిన డా.ఆదిల్, పుల్వామాకు చెందిన డా.ముజమ్మిల్ అహ్మద్, లఖ్‌నవూకు చెందిన డా.షాహీన్ ఉన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో డా.ముజమ్మిల్ అహ్మద్ అద్దె నివాసంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. ఇతడు అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో బోధకుడిగా పనిచేస్తున్నాడు. శ్రీనగర్‌లో జైషే మహమ్మద్ పోస్టర్లు వేసిన కేసులోనూ వాంటెడ్‌గా ఉన్నాడు.

షాహీన్ కారులో ఓ ఏకే-47 రైఫిల్ లభ్యమైంది. జమ్మూకశ్మీర్‌లోని ఆయా ప్రాంతాలతోపాటు హరియాణాలోని ఫరీదాబాద్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లో స్థానిక పోలీసులతో కలిసి సోదాలు నిర్వహించాం. మరికొంతమంది నిందితుల పాత్ర బయటపడింది. వారినీ అరెస్టు చేస్తాం.

ఇప్పటివరకు ఓ చైనీస్ స్టార్, బెరెట్టా పిస్టల్స్, ఏకే 56, ఏకే క్రింకోవ్ రైఫిళ్లు, 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం. నిధులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story