Vise President Elections : మొదలైన ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ
రిటర్నింగ్ అధికారులను నియమించిన ఈసీ

జగదీప్ ధన్‌ఖర్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. శుక్రవారం ఈ ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారిని, సహాయ రిటర్నింగ్ అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ని 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా ఈసీ నియమించింది. అలాగే రాజ్యసభ సంయుక్త కార్యదర్శి గరిమా జైన్, డైరెక్టర్ విజయ్ కుమార్ లను అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఈసీ నియమించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం భారత ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహించే బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన మీదట ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఒక రిటర్నింగ్ అధికారితో పాటు ఒకరు లేక ఇద్దరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియమించే అధికారం ఈసీకి ఉంటుంది. రిటర్నింగ్ అధికారులుగా లోక్‌సభ, రాజ్యసభల సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తున్న వ్యక్తులను మార్చి మార్చి నియమిస్తుంటారు. గత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడంతో ఈ సారి జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదించి రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ను ఈసీ నియమించింది. ఇందుకు సంబంధించిన గజెట్ నోటిఫికేషన్ నేడు శుక్రవారం సాయంత్రానికి విడుదలవుతుంది.
