బాధిత కుటుంబాలు సిబ్బందిపై ఆరోపణలు

Tragic Fire in Jaipur SMS Hospital ICU: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ప్రముఖ సవాయి మాన్ సింగ్ (ఎస్‌ఎమ్‌ఎస్) ఆసుపత్రి ఐసియులో ఆదివారం రాత్రి జరిగిన భయానక అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది రోగులు మరణించారు. ఈ సమయంలో ఐసియులో మొత్తం 11 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

స్టోరేజ్ ఏరియాలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు, అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో స్టోరేజ్‌లోని వైద్య సామగ్రి, ఐసియు పరికరాలు, ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

మృతుల్లో ఆరుగురిని గుర్తించారు. పొగ హాస్పిటల్ మొత్తం వ్యాపించడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి సిబ్బంది, వార్డ్ బాయ్‌లు వెంటనే రోగులను సురక్షిత ప్రదేశానికి తరలించారు. బాధిత కుటుంబాలు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సుమారు రెండు గంటల పాటు కష్టపడి మంటలను అదుపు చేశాయి. అయితే, వారు చేరుకునేసరికి పొగ ఇప్పటికే భవనమంతా వ్యాపించినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోగారం పటేల్, హోం శాఖ సహాయ మంత్రి జవహర్ సింగ్ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. "ఈ అగ్నిప్రమాదం చాలా దురదృష్టకరం. రోగుల భద్రత, చికిత్స కోసం అన్ని చర్యలు తీసుకుంటాం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. సాధ్యమైన సహాయం అందిస్తాం" అని ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story