SIT దర్యాప్తును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

TVK Chief Vijay: కరూర్‌లో టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీ సమయంలో జరిగిన తీవ్ర తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) దర్యాప్తును సవాలు చేస్తూ టీవీకే చీఫ్ విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సిట్ పార్టీకి వ్యతిరేకంగా పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని, దర్యాప్తు నిష్పాక్షికంగా జరగకపోతే అది పార్టీపై దురుద్దేశపూర్వక చర్యలేనని విజయ్ తన పిటిషన్‌లో ఆరోపించారు.

సీనియర్ ఐపీఎస్ అధికారి అస్రాగార్గ్ నేతృత్వంలో మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన సిట్, రాష్ట్ర పోలీసు అధికారులతోనే కూడా ఉందని టీవీకే పిటిషన్‌లో పేర్కొంది. ఇది దర్యాప్తును పక్షపాతపరుస్తుందని, హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దర్యాప్తును ప్రభావితం చేశాయని వాదించారు. మద్రాస్ హైకోర్టు తమ పార్టీపై తీవ్రంగా వ్యాఖ్యానించడం, విజయ్ కు నాయకత్వ లక్షణాలు లేవని, ఘటన తర్వాత పార్టీ నేతలు పారిపోయారని చెప్పడం తప్పుదోవ పట్టించడమేనని టీవీకే స్పష్టం చేసింది. ఈ ఘటన సమయంలో అన్ని పార్టీలు సహాయ చర్యలు చేపట్టాయని, కానీ నిర్వాహకులు వెంటనే స్పందించలేదని హైకోర్టు తప్పుపట్టినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

విజయ్ ర్యాలీలో ముందస్తు ఇబ్బందులు సృష్టించే కుట్రలు జరిగాయని, అవి దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను కలవడానికి డీజీపీకి మెయిల్ పంపిన విజయ్, వీడియో కాల్‌ల ద్వారా ఇప్పటికే మృతుల కుటుంబాలతో మాట్లాడారు. వారిని ఓదార్చిన ఆయన, త్వరలోనే వారి వద్దకు వస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో విజయ్‌ తప్పు లేదని, ఆయన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలని బాధితులే కోరుకుంటున్నారని పార్టీ నేత అరుణ్ రాజ్ తెలిపారు.

ఇదిలాంటి నేపథ్యంలో తొక్కిసలాటలో మృతి చెందిన 13 ఏళ్ల బాలుడి తండ్రి కూడా సుప్రీంకోర్టును సంప్రదించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని అభ్యర్థించారు. టీవీకే పార్టీ ఈ ఘటనను రాజకీయ కుట్రగా చూస్తూ, సుప్రీంకోర్టు నుంచి న్యాయం ఆశిస్తోంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరపనుందని సమాచారం.

PolitEnt Media

PolitEnt Media

Next Story