దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: కిషన్‌రెడ్డి

Union Minister of Coal and Mines G. Kishan Reddy: కేంద్ర బడ్జెట్‌-2026 దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా రూపొందించబడిందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌ ప్రకటన తర్వాత దిల్లీలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, ఈ బడ్జెట్‌ ఉపాధి అవకాశాలను పెంచి, రక్షణ రంగాన్ని శక్తివంతం చేస్తుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్‌ రైలు కారిడార్లు ప్రకటించగా, వాటిలో మూడు హైదరాబాద్‌ నుంచి ప్రారంభమవుతాయని, ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమని ఆయన అన్నారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ నగరానికి ఈ మూడు కారిడార్లు ఎంతో సంతోషకరమని చెప్పారు.

బడ్జెట్‌లో ప్రకటించిన బయోఫార్మా శక్తి కార్యక్రమం హైదరాబాద్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఎరువుల సబ్సిడీకి గత సంవత్సరం కంటే రూ.7 వేల కోట్లు అధికంగా కేటాయించారని తెలిపారు. తెలంగాణకు పన్నుల వాటా 13.5 శాతం పెరిగిందని, భారతీయ వస్త్ర పరిశ్రమకు చేయూత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంతో వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు ఒక బాలికల హాస్టల్‌ ప్రకటించడంతో తెలంగాణలోని 33 జిల్లాలకు 33 హాస్టళ్లు వస్తాయని చెప్పారు. హైదరాబాద్‌ వంటి నగరాలు రూ.వెయ్యి కోట్లకు మించి మున్సిపల్‌ బాండ్లు సేకరిస్తే కేంద్రం నుంచి రూ.100 కోట్ల ప్రోత్సాహకం లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రెండో దశకు సంబంధించి తగిన డీపీఆర్‌ సమర్పిస్తే నిధుల విడుదలపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తును రెండేళ్లుగా సాగదీస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌, భారాస పార్టీలపై ప్రజల విశ్వాసం సన్నగిల్లిందని ఆయన అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా మంచి ఫలితాలు సాధించి, ప్రజల మనసు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story