Rahul Gandhi: యూపీఐపై ఛార్జీలకు రంగం సిద్ధం.. అమెరికా ఒత్తిడికి మోదీ తలొగ్గారని రాహుల్ విమర్శ
రాహుల్ విమర్శ

Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై రుసుము విధించేందుకు నిశ్శబ్దంగా దారి సుగమం చేసిందని, అమెరికా ఒత్తిడికి మరోసారి లొంగిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
మంగళవారం ఎక్స్‌లో హిందీలో పోస్ట్ చేస్తూ ‘‘ఇప్పుడు ₹2,000 పైన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించవచ్చు. ఈ లావాదేవీలు మొత్తం వాల్యూమ్‌లో కేవలం 5 శాతం ఉన్నా, విలువలో దాదాపు 65 శాతం ఉంటాయి. ప్రభుత్వం వినియోగదారులపై రుసుము విధించం అంటోంది. కానీ దుకాణదారులపై విధించిన రుసుము చివరికి ఎక్కడ నుంచి వస్తుంది? వస్తువుల ధరల్లో చేర్చి వినియోగదారుల జేబు నుంచే తీసుకుంటారు’’ అని రాహుల్ అన్నారు.
అమెరికన్ పేమెంట్ కంపెనీలు భారత్ జీరో-ఎండీఆర్ విధానాన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాయని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం అదే దిశగా విధానం మార్చే దారి తెరిచిందని ఆరోపించారు. ‘‘అమెరికా ట్రేడ్ డీల్‌లా, ఒత్తిడికి లొంగిన ప్రధాని మోదీ మరోసారి అమెరికా ఒత్తిడికి సరెండర్ అయ్యారు’’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ కూడా ప్రభుత్వ నోటిఫికేషన్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. ₹2,000 లోపు లావాదేవీలపై మాత్రమే రుసుము విధించకూడదని చెప్పి, అంతకు పైన ఉన్నవాటిపై రక్షణ లేదని అన్నారు. ‘‘యూపీఐ లావాదేవీలపై రుసుము విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రేపు క్యాప్ మార్చవచ్చు. చట్టంలో ఇక హామీ లేదు. ఇదంతా అమెరికన్ కంపెనీలకు డిజిటల్ పేమెంట్స్ తెరిచి ట్రంప్‌ను సంతోషపెట్టేందుకేనా?’’ అని ప్రశ్నించారు.
ప్రభుత్వం సెప్టెంబర్ 14 నాటి గెజిట్ నోటిఫికేషన్‌లో ₹2,000 లోపు యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై బ్యాంకులు లేదా సిస్టమ్ ప్రొవైడర్లు రుసుము విధించకూడదని పేర్కొంది. కానీ అంతకు పైన ఉన్న లావాదేవీలపై స్పష్టత ఇవ్వలేదు. ఇంతవరకు యూపీఐ లావాదేవీలపై ఎలాంటి రుసుము లేదు.

