నకిలీ ఏజెంట్ల హామీలు నమ్మొద్దు!

US Embassy Warning: భారత్‌లోని అమెరికా ఎంబసీ వీసా దరఖాస్తుదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. హెచ్‌-1బీ వీసా ప్రక్రియలో ఆలస్యాలు, రెన్యూవల్స్‌లో జాప్యాల నేపథ్యంలో నకిలీ ఏజెంట్లు మోసాలకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ ఆలస్యాలను అడ్డుపెట్టుకొని కొందరు మోసగాళ్లు దరఖాస్తుదారులను సంప్రదించి, "ఎలాంటి జాప్యం లేకుండా వీసా సులువుగా సాధించి ఇస్తాం" అంటూ హామీలు ఇస్తున్నారు. ఇలాంటి మాటలు నమ్మి డబ్బులు ఇస్తే ఆర్థిక నష్టం తప్పదు, ప్రయాణ ప్రణాళికలు దెబ్బతినవచ్చని ఎంబసీ హెచ్చరిస్తోంది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారిక అడ్వైజరీ విడుదల చేసింది.

వీసా అపాయింట్‌మెంట్లు కేవలం అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే బుక్ అవుతాయని ఎంబసీ స్పష్టం చేసింది. అధికారిక ప్రక్రియ బయట ఎవరైనా వీసా ఇప్పిస్తామంటే అది పూర్తిగా మోసమేనని హెచ్చరించింది. అధికారిక ఫీజు కంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదని, అలాంటి డిమాండ్లు వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

గతంలో అమెరికా ప్రవేశపెట్టిన కొత్త సోషల్ మీడియా స్క్రీనింగ్ పాలసీ కారణంగా భారతీయ హెచ్‌-1బీ దరఖాస్తుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వీసా ఇంటర్వ్యూలు నెలల తరబడి వాయిదా పడుతున్నాయి. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికాతో చర్చలు జరుపుతోంది.

దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్లు (travel.state.gov, in.usembassy.gov/visas) నుంచి మాత్రమే సమాచారం తీసుకోవాలని, నకిలీ సందేశాలు, కాల్స్, ఏజెంట్లను పూర్తిగా నమ్మవద్దని ఎంబసీ సలహా ఇచ్చింది. మోసాలు గుర్తించినట్లయితే స్థానిక పోలీసులకు, ఎంబసీకి నివేదించాలని కోరింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story