రాజ్‌నాథ్ గుర్తుచేసుకున్న ఆ సంఘటన

Rajnath Recalls the Incident: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వాక్చాతుర్యం ప్రపంచ ప్రసిద్ధి. కవిత్వంతో హృదయాలను ఆకట్టుకున్న ఆయన, ప్రత్యర్థులను కూడా పదునైన మాటలతో మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఆయనను 'వాచస్పతి'గా పిలుస్తారు. అలాంటి మహానేతకు ఒకసారి పాకిస్తాన్ మహిళ నుంచి అనూహ్యమైన పెళ్లి ప్రతిపాదన వచ్చింది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఆమెను ఆశ్చర్యపరిచింది. వాజ్‌పేయీ 101వ జయంతి సందర్భంగా ఈ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.

దిల్లీలో వాజ్‌పేయీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ... "ఒకసారి వాజ్‌పేయీజీ పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. ఆయన ప్రసంగాలకు ఆకర్షితురాలైన ఓ పాకిస్తానీ మహిళ ఆయన వద్దకు వచ్చి, 'నన్ను పెళ్లి చేసుకుంటారా? అందుకు బదులుగా కశ్మీర్‌ను ఇస్తారా?' అని అడిగింది. దీనికి వాజ్‌పేయీజీ నవ్వుతూ, 'పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే... కానీ కట్నంగా మొత్తం పాకిస్తాన్‌ను ఇవ్వాలి' అని సమాధానమిచ్చారు" అంటూ ఆ సంఘటనను వివరించారు. ఈ మాటలకు అక్కడి వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

వాజ్‌పేయీ అద్భుతమైన ప్రసంగ నైపుణ్యం కలిగిన నేత అని రాజ్‌నాథ్ కొనియాడారు. రాజకీయ విమర్శలు చేసినా ఎప్పుడూ మర్యాదలు దాటని వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. భాజపా విస్తరణను చూసి ఆనందించిన వాజ్‌పేయీ, "నా కుటుంబం చాలా పెద్దదైంది" అంటూ హర్షం వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి గుర్తుచేసుకున్నారు.

వాజ్‌పేయీ గొప్ప రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, అద్భుత కవి, రచయిత కూడా. ఆయన మాటల్లో సరస్వతి నివసించేదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడేవారు. పార్లమెంటు లోపల, వెలుపల ఆయన ప్రసంగాలు ప్రత్యర్థులను సైతం ఆకర్షించేవి. వాజ్‌పేయీ జీవితాంతం అవివాహితుడిగానే గడిపారు. గ్వాలియర్‌లో తనతో చదువుకున్న స్నేహితురాలి కుమార్తెను దత్తత తీసుకుని పోషించారు.

వాజ్‌పేయీ వంటి మహానేతలు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన ఆశయాలు ఇప్పటికీ దేశ ప్రగతికి దిశానిర్దేశం చేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story