Vijay Faces Another Setback: తమిళనాట అదే సందిగ్ధత.. మళ్లీ విజయ్‌కు గవర్నర్ తిరస్కరణ!
మళ్లీ విజయ్‌కు గవర్నర్ తిరస్కరణ!

Vijay Faces Another Setback: తమిళనాడు రాజకీయాలు క్షణక్షణం మారుతున్న నేపథ్యంలో టీవీకే (తమిళగ వెట్రి కళగం) అధినేత విజయ్ గురువారం మరోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని మళ్లీ విజయ్ అభ్యర్థించగా, గవర్నర్ మెజార్టీ నిరూపించుకోవాలని స్పష్టం చేశారు.
లోక్‌భవన్ విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో ‘‘ఈరోజు గవర్నర్ ఆర్లేకర్‌తో విజయ్ భేటీ అయ్యారు. మెజార్టీ కనిపించడం లేదని వివరించారు. మెజార్టీతోనే రావాలని గవర్నర్ సూచించారు’’ అని తెలిపారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీలను ఆహ్వానించబోమని విజయ్‌కు గవర్నర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు రోజుల్లోనే రెండుసార్లు గవర్నర్‌ను కలిశారు విజయ్. కాంగ్రెస్ మద్దతు ఉన్నప్పటికీ, గవర్నర్ సంఖ్యాబలంపై సంతృప్తి వ్యక్తం చేయలేదు. 118 మంది సభ్యుల మద్దతు (మెజార్టీ మార్కు) సమకూర్చుకున్న తర్వాతే రావాలని సూచించినట్లు తెలుస్తోంది. టీవీకే 108 సీట్లు గెల్చుకుంది.
వీసీకే, సీపీఐ సానుకూలం.. డీఎంకే కూడా మద్దతు
ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు అవకాశం ఇవ్వాలని వీసీకే (విదుతలై చిరుత్తైగళ్ కచ్చి) గవర్నర్‌ను కోరింది. అయితే సహకారం ఇవ్వాలనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే, సీపీఐ సానుకూలంగా ఉన్నా అధికారికంగా ప్రకటించలేదు. టీవీకేకు మొదటి అవకాశం ఇవ్వాలని డీఎంకే కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది.
సీఎం కాన్వాయ్ నిరాకరణ
ప్రొటోకాల్ ప్రకారం సీఎం కోసం అందించిన పోలీసు కాన్వాయ్‌ను విజయ్ నిరాకరించారు. ప్రమాణ స్వీకారానికి ముందే ఆ ఏర్పాటు వద్దని పార్టీ తరఫున తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత మే 4న నాలుగు కాన్వాయ్ వాహనాలు అందజేసినా, వాటిని తిరిగి ఇచ్చేశారు. గవర్నర్ వద్దకు వెళ్లేటప్పుడు కూడా ప్రభుత్వ వాహనం వాడలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తమిళనాడులో టీవీకే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడు, ఎలా జరుగుతుందనే సందిగ్ధం కొనసాగుతోంది.

