DMK MLA Anita Radhakrishnan’s Sensational Comments: 6 నెలల్లో విజయ్ ప్రభుత్వం కూలిపోతుంది: డీఎంకే ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు
డీఎంకే ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు

DMK MLA Anita Radhakrishnan’s Sensational Comments: తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండదని డీఎంకే సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ డీఎంకే పార్టీ అధికారం చేపట్టనుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
దక్షిణ తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనిత రాధాకృష్ణన్ మాట్లాడుతూ, "ఇంకో నాలుగు నెలలు మాత్రమే టీవీకే ప్రభుత్వం ఉంటుంది. అధవ్ అర్జున్‌కు ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నేను కూడా రాజీనామా చేస్తాను. ఇద్దరం తిరుచెందూర్ నుంచి పోటీ చేద్దాం. ఇది మా ప్రాంతం.. ఎవరినైనా ఓడిస్తాం" అని సవాల్ విసిరారు.
ఎంకే స్టాలిన్‌ను 'బాస్' అని సంబోధిస్తూ, "స్టాలిన్ తిరుచ్చి నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నా. స్టాలిన్ కొలతూర్‌ను సింగపూర్‌లా మార్చారు. నాలుగు నెలలు లేదా ఆరు నెలల్లో మళ్లీ మా బాస్ ముఖ్యమంత్రి అవుతారు" అని ఆమె అన్నారు.
టీవీకే, డీఎంకే మధ్య రాజకీయ పోరు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో అనిత రాధాకృష్ణన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీవీకే పార్టీ లేదా అధవ్ అర్జున్ ఇంకా స్పందించలేదు.
విజయ్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు..
ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ పాత రాజకీయ సంప్రదాయాలకు గుడ్‌బై చెప్పారు. ప్రభుత్వ అధికారి తరహాలో వ్యవహరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత దుస్తులు మార్చుకుని, వైట్ షర్టుపై బ్లాక్ బ్లేజర్, బ్లాక్ ప్యాంటు ధరిస్తున్నారు. ఆఫీసు సమయానికి 15 నిమిషాల ముందే కార్యాలయానికి చేరుకుంటున్నారు. చాంబర్‌లోనే మధ్యాహ్న భోజనం చేసి, వెంటనే విధులు కొనసాగిస్తున్నారు.

