TVK Chief Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ భావోద్వేగ స్పందన.. హృదయం ముక్కలైంది: టీవీకే అధినేత
హృదయం ముక్కలైంది: టీవీకే అధినేత

TVK Chief Vijay: తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో తన ప్రచార సభలో సంభవించిన తొక్కిసలాట ఘటనపై ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ స్పందించారు. ఈ విషయంపై ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.
‘‘నా హృదయం ముక్కలు ముక్కలుగా అయింది. నేను తట్టుకోలేని బాధ, దుఃఖంలో మునిగిపోయాను. ఆ బాధను మాటల్లో చెప్పలేను. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని విజయ్ పేర్కొన్నారు.
తమిళనాడు కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఈ తొక్కిసలాట సంభవించింది. ఇందులో 39 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. విజయ్ ప్రసంగం చేస్తుండగా.. కొంతమంది అకస్మాత్తుగా ఆయన దగ్గరకు రావాలని ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం రావాల్సిన విజయ్.. ఆరు గంటలు ఆలస్యంగా కరూర్ చేరుకోవడం, అంచనాలకు మించి ఎక్కువ మంది ప్రజలు ర్యాలీకి హాజరు కావడం ఈ ఘటనకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిషన్‌ను నియమించింది.
