Vijay’s Sensational Decision on Liquor Shops: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సామాన్య ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలు, బస్టాండ్ల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 717 TASMAC మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

మంగళవారం తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్ల నుంచి 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు కూడా ఉండకూడదు. TASMAC ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దుకాణాలను రెండు వారాల్లోగా మూసివేయాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం తమిళనాడులో మొత్తం 4,765 మద్యం రిటైల్ దుకాణాలు TASMAC నిర్వహణలో ఉన్నాయి. వాటిలో 717 దుకాణాలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 276 ప్రార్థనా స్థలాల సమీపంలో, 186 విద్యాసంస్థల సమీపంలో, 255 బస్టాండ్ల సమీపంలో ఉన్నాయి. సీఎం విజయ్ ఆదేశాల మేరకు ఈ దుకాణాలు త్వరలో మూతపడతాయి.

ఈ నిర్ణయం పట్ల అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ స్వాగతం పలికారు. ఎక్స్ వేదికపై స్పందించిన ఆయన, ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థల సమీపంలో మద్యం దుకాణాలు తొలగించాలని ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారని తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తీసుకున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. మద్యం అమ్మకాలు ప్రభుత్వ విధిగా ఉండకూడదని, వాటిని కేవలం నియంత్రించడమే ప్రభుత్వ బాధ్యత అని అభిప్రాయపడ్డారు. ఈ చర్య 717 దుకాణాలతో ఆగకుండా నిరంతరం కొనసాగించాలని సూచించారు.

ఈ నిర్ణయం తమిళనాడులో మద్యం వ్యతిరేక ఉద్యమాలకు బలం చేకూర్చేలా ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story