ప్రతి రంగంలో బలమైన భారత్‌ సృష్టించాలి: అజిత్‌ డోభాల్‌

Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ యువతకు ముఖ్యమైన సూచనలు చేశారు. దిల్లీలోని ‘వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌’ కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశ చరిత్ర నుంచి పాఠాలు గ్రహించాలని పిలుపునిచ్చారు. ప్రతీకారం అనేది సాధారణంగా మంచిది కాదని, కానీ దానిని ప్రేరణగా మార్చుకుని ముందుకు సాగాలని సలహా ఇచ్చారు. మన సరిహద్దుల వద్ద మాత్రమే కాకుండా, గతంలో దేశంపై జరిగిన అణచివేతలకు కూడా ప్రతీగా బలమైన భారత్‌ను నిర్మించాలని అన్నారు. ఇందుకోసం సైనిక, ఆర్థిక, సామాజిక రంగాల్లో భద్రతను పటిష్ఠం చేయాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధులైన మహాత్మా గాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌ల ధైర్యాన్ని అనుసరించాలని కోరారు.

చరిత్రలో విదేశీ శక్తులు మన దేశంపై దాడులు చేసి ఆలయాలు, గ్రామాలను నాశనం చేసినా, మన పూర్వీకులు ఎవరినీ హాని చేయలేదని డోభాల్‌ గుర్తు చేశారు. ఆ పాఠాలతో మనమూ ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా ప్రగతి దిశగా అడుగులు వేయాలని అన్నారు. ఏ దేశమూ అభివృద్ధి సాధించాలంటే మంచి నాయకత్వం కీలకమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఫ్రాన్స్‌ చక్రవర్తి నెపోలియన్‌ మాటలను ఉటంకిస్తూ, ‘గొర్రె నేతృత్వంలోని వెయ్యి సింహాలకు భయపడను.. కానీ సింహం నేతృత్వంలోని వెయ్యి గొర్రెలకు భయపడతాను’ అని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ వేగవంతమైన అభివృద్ధి పథంలో పయనిస్తోందని డోభాల్‌ అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లిందని కొనియాడారు. మరికొన్ని సంవత్సరాల్లో భారత్‌ అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమంపై మోదీ నిబద్ధత, కృషి, నాయకత్వ లక్షణాలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story