Rahul Gandhi: మోదీ, షాలను సత్యం-అహింసతో ఓడిస్తాం: రాహుల్ గాంధీ
సత్యం-అహింసతో ఓడిస్తాం: రాహుల్ గాంధీ

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యం, అహింస ఆయుధాలతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సత్యం గెలవడానికి సమయం పట్టొచ్చు కానీ, అంతిమ విజయం సత్యానిదేనని నొక్కి చెప్పారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన 'ఓట్ చోర్ గద్దీ ఛోడ్' మహా ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సంఘం (ఈసీ) దేశానికే చెందిందని, మోదీకి మాత్రమే పరిమితం కాదని రాహుల్ గాంధీ హితవు పలికారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లకు రక్షణ కల్పిస్తూ మోదీ చట్టం తెచ్చారని, భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని సవరించి, అవసరమైతే కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సత్యం-అసత్యం మధ్య పోరాటం జరుగుతోందని, బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టుగా ఎన్నికల కమిషన్ ప్రవర్తిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై గట్టి నమ్మకంతో ఉందని, పోరాటంలో సమయం పట్టినా చివరికి సత్యమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య బాటలోనే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ ప్రపంచం అధికారం వైపు చూస్తుందని, సత్యం వైపు కాదని అంటున్నారని రాహుల్ విమర్శించారు. అది ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనా విధానమని, భారతీయ సంప్రదాయాలు మాత్రం సత్యాన్ని ప్రధానంగా చెబుతాయని పేర్కొన్నారు. ప్రతి మతం సత్యాన్నే కీలకంగా పేర్కొంటుందని, కానీ భగవత్ మాత్రం అధికారమే ముఖ్యమని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
'సత్యాన్ని ఆచరిస్తూ, సత్యంతోనే ముందుకు సాగితే నరేంద్ర మోదీ, అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వాన్ని భారత్ నుంచి తొలగించగలం' అని ఈ ర్యాలీ వేదిక నుంచి రాహుల్ గాంధీ ప్రకటించారు.

