అదో అనిర్వచనీయమైన ఉత్సవం. సామూహిక సంబరం. మహానదిలా వెల్లువెత్తే భక్తి తరంగం. మదిమదిలో ఆధ్యాత్మికభావం. అణువణువునా ఉత్సాహం.అదే మహా రథోత్సవం. జగన్నాథ రథోత్సవం. ఆషాఢ శుద్ధ విదియ రోజున అంటే ఈ రోజున జరుగుతున్న అపురూప సన్నివేశం. లక్షలాది మంది భక్తుల సమక్షంలో జోరుగా సాగుతోంది రథయాత్ర!

జగన్నాథ రథయాత్ర ఎందుకు జరుగుతుంది? రథోత్సవ నేపథ్యమేమిటి? అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో కథనం చెబుతారు. కంసుడిని చంపడానికి బలరామకృష్ణులు బయలుదేరిన సన్నివేశాన్ని స్ఫురణకు తేవడానికే ఈ యాత్ర జరుపుతారని కొందరు అంటారు. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి ముచ్చట తీర్చే సందర్భమే రథయాత్ర అంటారు మరికొందరు. జగన్నాథుడి రథయాత్రలో మరో విశేషం ఉంది. తేరులలో ఊరేగే దేవుళ్లకు తెలిసో తెలియకో ఏమైనా లోటుపాట్లు చేస్తే రథం అస్సలు కదలదట! భక్తులు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగదట! భక్తులంతా కలిసి అపచారాన్ని మన్నించమంటూ వేడుకుని కొబ్బరికాయ కొడితే తప్ప రథం కదలదట!

వైశాఖమాసంలో రథ నిర్మాణాలు మొదలవుతే, జ్యేష్ట పౌర్ణమి రోజున దేవస్నాన యాత్రలు ప్రారంభమవుతాయి. 108 బిందెల జలాలతో మూర్తులను అభిషేకిస్తారు. అంత సుదీర్ఘమైన స్నానాలను ఆచరించినందున రెండువారాలు విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు దైతపతులు అనే సవరలకు తప్ప మరెవరికీ బలభద్ర, సుభద్ర, జగన్నాథుల దర్శనం లభించదు. నిత్యం 64 రకాల నైవేద్యాలను స్వీకరించే స్వాములు ఈ విశ్రాంతి సమయంలో మాత్రం కందమూలాలు మాత్రమే తీసుకుంటారు. ఏడాది పొడుగునా ఇన్నేసి ప్రసాదాలు ఆరగించే స్వామికి ఆరోగ్యం దెబ్బతింటుందేమోనన్న తలంపుతోనే నైవేద్యాలకు విరామం ప్రకటిస్తారు. రకరకాల ఆయుర్వేద ఔషధాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలాంటి ఔషధసేవ మరే ఆలయంలో కనిపించదు. ఇది పూరీ జగన్నాథుడికే సొంతం!

అన్నట్టు పూరీ క్షేత్రంలో తప్ప ప్రపంచంలోనే ఇంత పెద్ద ఓపెన్‌ కిచెన్‌ లేదట! 500 మంది పాకశాస్త్ర నిపుణులు, 300 మంది సహాయకులు ప్రసాదాలను తయారుచేస్తారు. వండేదంతా నలభీములే! అంటే పురుషులేనన్నమాట! ఇక్కడ వంటలను లక్ష్మీదేవి అదృశ్యరూపంలో పర్యవేక్షిస్తుందట! ఆమె గజ్జల సవ్వడి కూడా వినిపిస్తుందట! అందుకే వంటకాలు అంత రుచికరంగా ఉంటాయట! అందుకే ఇక్కడి అర్పణాన్ని మహాలక్ష్మీపాకం అంటారు. ఒకసారి వండిన పాత్రలో మరోసారి వండరు. ఎప్పటికప్పుడు కొత్త కుండలను ఉపయోగిస్తారు. అవి కూడా దగ్గరలో ఉన్న కుంభారు గ్రామస్తులు చేసిన కుండలనే వాడతారు!

పూరీ ఆలయ గోపురంపైన కట్టిన ధ్వజం గాలి వీస్తున్న దిశకు కాకుండా వ్యతిరేకదిశకు రెపరెపలాడటం విశేషం.ఇక జగన్నాథ ఆలయంపైన పక్షలు అస్సలు ఎగరవు. ఎందుకనేది ఇప్పటికీ అంతుపట్టకుండా ఉంది. ఇది మరో విశేషం. పక్కనే ఉన్న సముద్రపు కెరటాల చప్పుడు ఆలయం బయట స్పష్టగా వినిపిస్తుంది. సింహద్వారం నుంచి ఆలయంలో ప్రవేశించగానే అలల చప్పుడు ఏ మాత్రం వినిపించదు. ఇది ఇంకో విశేషం. గుండీచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకోగానే రథం తనంతట తానే ఆగిపోతుందట! ఇదో మిస్టరీ!

Next Story