Samajwadi Party President and MP Akhilesh Yadav: అమ్మాయిల దుస్తులు చించేస్తారా? విద్యార్థులతో అమానవీయ ప్రవర్తన సహించేది కాదు: అఖిలేశ్
అఖిలేశ్

నిరసనకారులపై పోలీసు లాఠీఛార్జ్‌పై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం
Samajwadi Party President and MP Akhilesh Yadav: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) విద్యార్థి నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఆయన “ఆందోళన చేస్తున్న అమ్మాయిల దుస్తులు చించేస్తారా?” అని ప్రశ్నించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, “విద్యార్థుల బాధను ప్రభుత్వం వినకపోతే వారు వీధుల్లోకి వస్తారు. అలా వచ్చిన విద్యార్థులతో పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. అమ్మాయిల దుస్తులు చించేశారు, లాఠీలతో కొట్టి తీవ్ర గాయాలు చేశారు. విద్యార్థులతో ఇలా ప్రవర్తించడం సరైనదా? దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రధాని మోదీ ఈ విషయంపై ప్రకటన చేయాలి” అని డిమాండ్ చేశారు.
విద్యార్థుల సమస్యపై బయట మాట్లాడుతున్న ప్రధాని పార్లమెంటులో ఎందుకు ప్రకటన చేయడం లేదని ప్రశ్నించిన అఖిలేశ్, ప్రధాని నివాసం వద్ద నిరసన చేయడానికి కూడా కారణం ఇదేనని వివరించారు.
అదే సమయంలో నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు తనకు అవకాశం ఇవ్వకపోవడంపై కూడా అఖిలేశ్ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వడం, భాజపా నేతలకు అనుమతించడం వంటి వాటిని ప్రస్తావిస్తూ “మా సంగతి ఏమిటి? ఏదైనా ఒప్పందం కుదిరిందా?” అని స్పీకర్‌ను ప్రశ్నించారు. అయితే, పేపర్ లీకేజీ విద్యార్థుల సమస్య అని, ఏ పార్టీ సమస్య కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో తనకు విభేదాలు ఉన్నాయా అనే ఊహాగానాలను కూడా ఆయన తోసిపుచ్చారు. విపక్షాలు ఐక్యంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ ఘటనలు నీట్ పరీక్షల పేపర్ లీక్ వ్యవహారంలో ప్రతిపక్షాలు, విద్యార్థుల మధ్య ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో జరిగాయి. అఖిలేశ్ వ్యాఖ్యలు పార్లమెంట్‌లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

