భర్తల చేతిలో భార్యలు, భార్యల చేతిలో భర్తలు – పెరుగుతున్న దారుణ హత్యలు
Wives at the hands of husbands, husbands at the hands of wives – increasing brutal murders

ఇటీవలి కాలంలో కుటుంబ కలహాలు ఘర్షణాత్మకంగా మారుతూ, దంపతుల మధ్య హత్యలు పెరిగిపోతున్నాయని గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ప్రేమ, నమ్మకం అనే బంధాన్ని హింస, అసూయ ముసుగుల్లో మింగేస్తున్న ఈ ధోరణి ఆందోళన కలిగించేలా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ముస్కాన్ రస్తోగి, మేఘాలయాలో సోనమ్ రఘువంశీ, ఆంధ్రప్రదేశ్‌లో లైసెన్స్ సర్వేయర్ తేజేశ్వర్ హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటనలన్నింటిలోనూ భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తలను ప్రణాళికబద్ధంగా హతమార్చినట్లు పోలీసులు తేల్చారు.
కానీ, తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భర్తల చేతిలో భార్యలు హతమవుతున్న శాతం ఆందోళన కలిగించే స్థాయికి చేరింది. గత 115 రోజుల్లో సుమారు 30 మంది మహిళలు భర్తల హింసకు బలయ్యారని అధికార గణాంకాలు చెబుతున్నాయి. అంటే సగటున ప్రతి నాలుగు రోజులకు ఓ భార్య భర్త చేతిలో ప్రాణాలు కోల్పోతున్నదన్న సంగతి ఆవిష్కృతమవుతోంది.
ఒక ఉదాహరణగా, ధాంతరిలో పెళ్లయిన మూడు నెలలకే ఓ భర్త తన భార్య గొంతు కోసి హతమార్చాడు. మరో కేసులో బలోడ్‌లో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించిందని భర్త ఫిర్యాదు చేశాడు. అయితే దర్యాప్తులో అది ప్రమాదం కాదని, భర్త చేసి ప్లాన్డ్ మర్డర్‌గా పోలీసులు నిర్ధారించారు. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ హత్యలలో 10కి పైగా సంఘటనలు అనుమానం, అసూయ కారణంగా జరిగాయి. మద్యం మత్తులో 6 హత్యలు, భార్యలు లైంగిక సంబంధాలను నిరాకరించడంతో 2 హత్యలు జరిగాయి. గృహ హింస, వరకట్న వివాదాలు కూడా ఈ హత్యల్లో ఉన్నాయి.
