సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా లేహ్‌లో నిరసనలు

Ladakh: లడక్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్‌లో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రముఖ విద్యావేత్త, యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా ఈ నిరసనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యువత రోడ్లపైకి వచ్చారు. ఈ ఆందోళనలు లేహ్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర రూపం దాల్చాయి.

ప్రారంభంలో శాంతియుతంగా సాగిన ఈ నిరసనలు కొంత సమయానికి హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు సీఆర్‌పీఎఫ్ వాహనానికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, పారామిలిటరీ బలగాలు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. నిరసనకారులతో తీవ్ర వాగ్వాదం జరిగినప్పటికీ, వారు వెనక్కి తగ్గకుండా రాష్ట్ర హోదా కోసం నినాదాలు చేశారు.

2019లో జమ్మూ కాశ్మీర్ నుంచి లడఖ్‌ను వేరు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం, లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని యువత డిమాండ్ చేస్తోంది. సోనమ్ వాంగ్‌చుక్ లడక్ ప్రజల హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ ఆందోళనలు ఊపందుకున్నాయి. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి, కొందరు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ, లడక్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని యువత తమ డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story