Yumnam Khemchand Singh: మణిపూర్‌కు కొత్త సీఎం: యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఎన్నిక
యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఎన్నిక

Yumnam Khemchand Singh: ఏడాది పాటు రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా బీజేపీ నాయకుడు యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ (62) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన త్వరలోనే మణిపూర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
మంగళవారం దిల్లీలోని మణిపూర్ భవన్‌లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. భాజపా, ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు హాజరై ఖేమ్‌చంద్‌ను తమ నేతగా ఎన్నుకున్నారు. అంతకుముందు భాజపా ఎమ్మెల్యేలు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేశారు.
తైక్వాండోలో నైపుణ్యం కలిగిన ఖేమ్‌చంద్ 2017 నుంచి 2022 వరకు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 2022లో బీరెన్‌సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మణిపూర్‌లోని మూడు ప్రధాన సామాజిక వర్గాలు – మైతేయ్‌లు, కుకీలు, నాగాలు –తో సత్సంబంధాలు కలిగి ఉండటం ఆయనకు బలంగా మారింది.
బుధవారమే ఆయన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరే అవకాశం ఉంది. మాజీ మంత్రి, కుకీ నాయకురాలు నెమ్చా కిప్‌గెన్ కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. నాగాలకు చెందిన మరో ఎమ్మెల్యేను రెండో డిప్యూటీ సీఎంగా నియమించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.
ఏడాది పాటు రాష్ట్రపతి పాలన
2023 మే నుంచి జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ అల్లకల్లోలంగా మారింది. గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ రాజీనామా చేయడంతో రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. 2022 ఎన్నికల్లో భాజపా 32 స్థానాలు గెలుచుకుంది. తర్వాత ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. ఎన్‌పీపీ (6), ఎన్‌పీఎఫ్ (5) కూడా ఎన్డీయేలో భాగస్వాములే.
ఈ నిర్ణయంతో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. రాష్ట్ర పదవీకాలం 2027 వరకు ఉంది.

