ఏసీ 20డిగ్రీల కంటే తక్కువ పెట్టొద్దు

New AC Rules : సాధారణంగా ఎయిర్ కండీషనర్లు (AC) ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. వేడి ప్రాంతాల్లోని ప్రజలు ఏసీని 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు, చల్లని ప్రాంతాల్లోని ప్రజలు 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల భారీగా విద్యుత్ వృధా అవుతుంది. సాధారణంగా ఒక వ్యక్తికి 23-24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొత్త ఏసీ నియమాలను రూపొందించడానికి సిద్ధమవుతోంది.

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశవ్యాప్తంగా త్వరలో కొత్త ఏసీ నియమాలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. నివేదికల ప్రకారం.. కొత్త నియమాల ప్రకారం ఏసీలు కేవలం 20-28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే అందించగలవు. అంటే, ఏసీ ఉష్ణోగ్రతను 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు సెట్ చేయలేరు, అదేవిధంగా 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువకు పెంచలేరు. ఇటువంటి నియమాన్ని అమలులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని కొన్ని ఇతర దేశాలలో కూడా ఇలాంటి నియమాలు అమల్లో ఉన్నాయి. అమెరికా, స్పెయిన్, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాల్లో ఏసీ ఉష్ణోగ్రతకు సంబంధించి మార్గదర్శకాలు లేదా నియమాలు ఉన్నాయి. జపాన్ దేశంలో ప్రభుత్వ భవనాలలో ఏసీ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్‌గా ఉండాలని సెట్ చేశారు. అమెరికా ఇళ్లలో ఏసీ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా ఉండాలని సూచించినప్పటికీ, ఇది తప్పనిసరి నియమం కాదు. సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలలో ఏసీని 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచాలని మార్గదర్శకాలు జారీ చేశారు. స్పెయిన్‌లో ఆసక్తికరమైన నియమాలు ఉన్నాయి. వేసవిలో ఏసీ ఉష్ణోగ్రతను 27 డిగ్రీల కంటే తక్కువకు సెట్ చేయకూడదు. అదే సమయంలో, శీతాకాలంలో ఏసీ ఉష్ణోగ్రత 19 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండకూడదు.

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సంస్థ ప్రకారం.. ఏసీ ఉష్ణోగ్రతను 20-24 డిగ్రీల సెల్సియస్‌కు సెట్ చేస్తే, దాదాపు 26శాతం వరకు విద్యుత్‌ను ఆదా చేయవచ్చట. ప్రతి ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రతను పెంచినప్పుడు, విద్యుత్ ఆదా 6శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త నియమాలు అమలులోకి వస్తే, దేశంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఇది విద్యుత్ ఉత్పత్తిపై భారాన్ని తగ్గించడమే కాకుండా, వినియోగదారుల విద్యుత్ బిల్లులపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అదే సమయంలో ప్రజలు సుఖంగా ఉండేలా చూస్తూనే, ఇంధన ఆదాను ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యం.

PolitEnt Media

PolitEnt Media

Next Story