Dating App Scam : మార్కెట్లోకి కొత్త స్కామ్.. ప్రేమ పేరుతో కుర్రాళ్ల జేబుకు కన్నం!
ప్రేమ పేరుతో కుర్రాళ్ల జేబుకు కన్నం!

Dating App Scam : డేటింగ్ యాప్స్ ద్వారా ప్రేమను వెతుక్కునే వారికి ఇప్పుడు కొత్త ప్రమాదం వచ్చి పడింది. తాజాగా ఢిల్లీలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక యువకుడికి డేటింగ్ యాప్‌లో పరిచయమైన అమ్మాయి కారణంగా పెద్ద స్కామ్‌లో చిక్కుకున్నాడు. ఢిల్లీలోని ఈస్ట్ ఆఫ్ కైలాష్‌లో ఉన్న లోకేష్ క్యాఫేలో జరిగిన ఈ డేట్ అతని జేబుకు 12 వేల రూపాయల చిల్లు పెట్టింది. ఇది ఏదో చిన్న ఘటన కాదు, ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న ఒక పెద్ద స్కామ్‌లో భాగం.
ఢిల్లీకి చెందిన ఒక యువకుడు డేటింగ్ యాప్‌లో తనకి నచ్చిన వ్యక్తిని వెతుకుతున్నాడు. ఒక అమ్మాయితో చాటింగ్ మొదలైంది, మాటలు బాగా కలిశాయి. అంతటితో ఆగకుండా ఆ అమ్మాయి అతన్ని ఈస్ట్ ఆఫ్ కైలాష్‌లోని లోకేష్ క్యాఫేలో కలవమని పిలిచింది. "కాఫీ తాగుతూ మాట్లాడదాం, ఏమవుతుంది?" అని ఆ యువకుడు అనుకున్నాడు. కానీ ఆ డేట్ తన జేబుకు ఇంత భారీగా నష్టం చేస్తుందని అతనికి తెలియదు. అతను కేవలం 3,000 రూపాయలు మాత్రమే తీసుకెళ్లాడు. తనను అడగకుండానే జగర్‌మాస్టర్ షాట్స్, రెడ్‌బుల్ తో కూడిన జగర్‌బాంబ్‌లను ఆర్డర్ చేయడం మొదలుపెట్టిందని రెడిట్లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఒక్క జగర్‌బాంబ్ ధర 1,200 రూపాయలు!
డేట్ పూర్తయి, బిల్లు వచ్చినప్పుడు ఆ యువకుడికి చెమటలు పట్టాయి. బిల్లు మొత్తం 11,958 రూపాయలు. యువకుడు ఆ అమ్మాయిని "నువ్వు ఎంత కడతావు ?" అని అడిగాడు. ఆమె ఇచ్చిన సమాధానం విని అతను మరింత ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మాయి "నా దగ్గర 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి" అని చెప్పి, వెంటనే క్యాఫే నుండి పరుగు లంకించుకుంది. యువకుడు క్యాఫే సిబ్బందిని బిల్లును రెండు భాగాలుగా డివైడ్ చేయమని అడిగాడు. కానీ అప్పుడే క్యాఫే యజమాని వర్ష అతడిని బెదిరించడం మొదలుపెట్టింది. "బిల్లు చెల్లించకపోతే పోలీసులు పిలుస్తాం, 10,000 రూపాయల జరిమానా కూడా కట్టాలి" అని యజమాని చెప్పింది. అంటే, బిల్లు ఇప్పుడు 22,000 రూపాయలు అవుతుందని బెదిరించింది.
ఆ యువకుడు వెంటనే తన స్నేహితుడికి ఫోన్ చేసి క్యాఫేకు రమ్మని పిలిచాడు. స్నేహితుడు వచ్చాక చాలా వాదోపవాదాలు జరిగాయి. చివరికి, ఎంతో కష్టపడి, ఈ వ్యవహారం 2,500 రూపాయలకు సెటిల్ అయింది. కానీ ఈ సంఘటన ఆ యువకుడికి ఒక పాఠం నేర్పింది. "ఇకపై డేటింగ్ యాప్స్‌లో తెలియని వారిని కలిసే ముందు వందసార్లు ఆలోచిస్తాను" అని అతను రాశాడు. ఇది అతని కథ మాత్రమే కాదు, డేటింగ్ యాప్స్ ద్వారా మోసపోతున్న అనేక మంది కథ.
రెడిట్‌లో ఈ పోస్ట్ తర్వాత, యూజర్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. చాలా మంది దీనిని ప్లాన్ ప్రకారం చేసిన మోసం అని అభిప్రాయపడ్డారు.ఢిల్లీ, ముంబైలో చాలా క్యాఫేలు ఈ రకమైన స్కామ్‌లను నడుపుతున్నాయని కొందరు వెల్లడించారు. ఈ స్కామ్ పద్ధతి చాలా తెలివైనది. డేటింగ్ యాప్‌లో అమ్మాయిలు మొదట అబ్బాయిలతో మాట్లాడటం మొదలుపెడతారు. ఆపై వారిని ఒక ప్లాన్డ్ క్యాఫేకు రమ్మని పిలుస్తారు. ఈ క్యాఫేలు ముందుగానే ఇందులో భాగం అయి ఉంటాయి. అక్కడకు వెళ్ళిన తర్వాత అమ్మాయి మెనూ చూపకుండా లేదా ధర చెప్పకుండా ఖరీదైన డ్రింక్స్, హుక్కా లేదా ఆహారాన్ని ఆర్డర్ చేస్తుంది. మీకు ఏం జరుగుతుందో అర్థం కాదు, బిల్లు వచ్చినప్పుడు అది వేల రూపాయల్లో ఉంటుంది. బిల్లు చెల్లించడానికి నిరాకరిస్తే క్యాఫే సిబ్బంది, అమ్మాయి కలిసి మిమ్మల్ని బెదిరిస్తారు. కొన్నిసార్లు పోలీసులు అని, కొన్నిసార్లు జరిమానా అని బెదిరింపులకు పాల్పడతారు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి.
