Housing Board Plots for Sale in Hyderabad

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం నిధుల సమీకరణకు కీలక నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ బోర్డు ఆధీనంలోని వివాదరహిత ప్లాట్లను వేలం వేయనుంది. ఈ వేలం ద్వారా వచ్చే నిధులను ఇందిరమ్మ పథకానికి వినియోగిస్తారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ పథకం మొదటి దశ గృహ ప్రవేశాలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 70 వేలకు పైచిలుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రతి నియోజవకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేయనుండగా.. మెుత్తం 4 విడతల్లో ఈ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు నిధుల సమీకరణ కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హౌసింగ్ బోర్డు తమ ఆధీనంలోని వివాదరహిత ప్లాట్లను వేలం వేయడానికి సిద్ధమవుతోంది. అన్ని జిల్లాల్లో గుర్తించిన ఈ ప్లాట్ల వివరాలను అధికారులు సిద్ధం చేశారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఈ వేలం ద్వారా భారీగా రెవెన్యూ సమకూర్చుకోవాలని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నిధులను నేరుగా ఇందిరమ్మ పథకానికి ఉపయోగించాలని భావిస్తోంది.హైదరాబాద్‌తో పాటు జోగుళాంబ గద్వాల, జడ్చర్ల, ఇతర జిల్లా కేంద్రాల్లోని ప్లాట్లను వేలం వేయనున్నారు. అధికారులు గుర్తించిన ప్లాట్లలో కోర్టు వివాదాలు లేనివి, ఎలాంటి కేసులు లేనివి, కమర్షియల్ ఏరియాల్లో ఉన్నవి ఉన్నాయి. మొత్తం 1250 జాగాలు (ప్లాట్లు) ఉండగా, ఇవి సుమారు 3.22 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సమీపంలోని ఖైతలాపూర్‌లోనే 250కి పైగా ప్లాట్లు ఉన్నట్లు సమాచారం. ఈ ప్లాట్లకు మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో హౌసింగ్ బోర్డుకు వేల కోట్ల విలువైన వందల ఎకరాల భూములు, ప్లాట్లు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఈ భూములు అధికంగా ఉన్నాయి.అన్యాక్రాంతం కాకుండా వీటిని పరిరక్షించడానికి హౌసింగ్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్లాట్ల చుట్టూ గోడలు, ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, అవి హౌసింగ్ బోర్డు భూములు అని తెలియజేస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు, వేలం ద్వారా సమీకరించిన నిధులతో ఇందిరమ్మ వంటి ప్రజా సంక్షేమ పథకాలకు ఊతం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా, ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి దశలో పూర్తయిన ఇళ్లకు వచ్చే నెల జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గృహ ప్రవేశాలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated On 28 May 2025 10:40 AM IST
Politent News Web3

Politent News Web3

Next Story