బనకచర్లపై రాహుల్ మౌనం కుట్రపూరితం - కెటిఆర్
లోక్ సభలో ప్రతిపక్ష నేతగా తెలంగాణ ప్రజలకు రాహూల్ గాందీ ద్రోహం

ఎంత పెరిగినా గొర్రెకు బెత్తడే తోక అన్నట్టు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సాధించింది ఏం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు. లోక్ సభలో ప్రతి పక్ష నాయకుడిగా ఏడాది పూర్తి చేసుకుంటున్న రాహుల్… తెలంగాణ సమస్యలు, ఈ ప్రాంతానికి హక్కుగా రావాల్సిన అంశాల మీద ఏ రోజు కూడా మాట్లాడలేదన్నారు. తెలంగాణకు ద్రోహం చేయడంలో బీజేపీతో రాహుల్ గాంధీ కలిసి పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాహుల్ మౌనంగా ఉండడం ముమ్మాటికి కుట్రే అన్నారు కేటీఆర్. గోదావరిలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను తన గురువు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ధారాదత్తం చేస్తుంటే ఆపకుండా రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
2014 పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ప్రశ్నించలేదని కేటీఆర్ గుర్తుచేశారు. కాళేశ్వరం లేదా పాలుమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కేంద్రాన్ని రాహుల్ ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలన్నారు. విభజన చట్టంలో ఉన్న ఐటి ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ITIR) ను 2015లోనే మోడీ ప్రభుత్వం రద్దు చేస్తే రాహుల్ గాంధీ మాట మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలికారన్నారు. వరంగల్ ప్రజల చిరకాల కోరిక అయిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా రాహుల్ వ్యవహరించిన తీరును ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. ఇక బొగ్గు బ్లాక్ లను కేటాయించకుండా తెలంగాణ కొంగు బంగారం సింగరేణి అస్థిత్వాన్నే మాయం చేయాలనుకున్న మోడీ ప్రభుత్వ కుట్రలపై రాహుల్ గాంధీ ఏ రోజు కూడా లోక్ సభలో మాట్లాడలేదన్నారు.
ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలుచేయలేక రేవంత్ రెడ్డి చతికిలపడితే రాహుల్ తప్పించుకు తిరుగుతున్నారని కేటీఆర్ విమర్శించారు. హామీల అమలుకు తనదే గ్యారంటీ అని గప్పాలు కొట్టిన రాహుల్, ఇప్పుడు తెలంగాణకు రాకుండా ముఖం చాటేశారన్నారు. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ను గెలిపించిన తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ ఇచ్చిన శాపం రేవంత్ సర్కార్ అని కేటీఆర్ మండిపడ్డారు.
