జూబ్లీహిల్స్ లో పట్టుకోసం కాంగ్రెస్ బీఆర్‌ఎస్ హోరాహోరీ

జాబ్లీహిల్స్ ఉపఎన్నిక అన్ని వర్గాలను ఆకర్షిస్తోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు అధికార పక్షం… సీటును తిరిగి దక్కించుకునేందుకు విపక్షం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పావులు కదుపుతున్నాయి.
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉన్నాయి. యూసుఫ్ గూడ డివిజన్ బీఆర్‌ఎస్, వెంగళ్‌రావు నగర్ బీఆర్‌ఎస్, ఎర్రగడ్డ ఎంఐఎం, రహమత్ నగర్ బీఆర్‌ఎస్, బోరబండ బీఆర్‌ఎస్, షేక్‌పేట్ ఎంఐఎం చేతిలో ఉన్నాయి. ఈ సందర్బంగా జూబ్లీహిల్స్ గురించి కొన్ని ప్రత్యేకత చెప్పుకోవాలి. ఈ నియోజకవర్గం పేరు చెప్పగానే శ్రీమంతుల ఏరియా అనుకుంటారు. అయితే ఈ నియోజకవర్గంలో పది శాతం ఓటర్లు తప్పితే మిగతా అంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలే అధికంగా ఉంటాయి.
ఒకప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో కొత్తగా ఏర్పడింది. 2009లో దివంగత నేత పి జనార్దన్ రెడ్డి కుమారుడు పి విష్ణు వర్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి సలీం మీద విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసిన మాగంటి గోపినాథ్ ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై గెలిచారు. ఈ ఎన్నికలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీచేసిన పి విష్ణువర్దన్ రెడ్డి మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
మారిన రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం నుంచి గెలిచిన మాగంటి గోపినాథ్ బీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్దన్ రెడ్డి మీద గెలిచారు. ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
2023లో జరిగిన ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన క్రికెటర్ మహ్మ ద్ అజారుద్దీన్ మీద 16.337 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మూడో స్థానంలో నిలవగా నాలుగో స్థానంలో ఎంఐఎం నిలిచింది. ఈ ఎన్నికల్లో విష్ణువర్దన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు.
తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
నియోజకవర్గంలో మొత్తం 4.01.365 ఓటర్లు ఉన్నారు. అందులో 2.08.561మంది పురుషులు కాగా 1.92.799 మహిళా ఓటర్లు ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో దిగగా నగర ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావులు ప్రచారం ఉధృతం చేశారు. నవీన్ యాదవ్ లోకల్ నేతగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు. నామినేషన్ల తర్వాత సునీతపై నవీన్ యాదవ్ కామెంట్స్, అఫిడవిట్‌పై ఫిర్యాదు కొంత కలకలం సృష్టించాయి. అదే సమయంలో నవీన్ యాదవ్ మీద బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది.
నవీన్ ఇప్పటికి రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి నియోజకవర్గంలో ఉంది. దీనికి తోడు అధికార పార్టీ అండదండలు కలిసి వస్తాయని భరోసాతో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరికోరి నిలబెట్టిన నవీన్ యాదవ్ గెలుపు అధికార పార్టీకి ప్రతిష్టగా మారింది.
బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత ప్రచారంలో హరీశ్‌రావు, కెటిఆర్ లు అంతా తామే అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధినేత కెసిఆర్ జూబ్లీహిల్స్ బాధ్యత కెటిఆర్, హరీష్‌రావులకు అప్పగించటంతో జోడెడ్ల మాదిరిగా బావ బావమరుదులు… చెరో మూడు డివిజన్లలో శ్రేణులను ముందుకు తీసుకెళుతున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నియోజకవర్గంలో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేవారని పేరుంది. కుల మతాలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకుపోతారనే పేరుంది. అయితే నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతల్ని ఎదగనీయలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల మీదనే విపక్షం ఆధారపడినట్టుగా కనిపిస్తోంది.
బిజెపి బరిలో ఉన్నా నామమాత్రమనే అనిపిస్తోంది. లంకల దీపక్ రెడ్డి చేస్తున్నా ఆయన బీఆర్‌ఎస్ ఓట్లనే చీలుస్తారని విశ్లేషణ జరుగుతోంది. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లో లక్షా 20 వేల పైచిలుకు ముస్లీం ఓటర్లు కీలకంగా ఉన్నారు. అయితే ముస్లిం ప్రతినిధులం అని చెప్పుకునే ఎంఐఎం పార్టీకి 2023 ఎన్నికల్లో కేవలం 7,848 మాత్రమే రావటం గమనార్హం. ఈసారి ఉప ఎన్నికల్లో ఎంఐంఎ పార్టీ తమ అభ్యర్థిని నిలపలేదు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఒవైసీ సోదరులు ముస్లిం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. షేక్ పేట్ మినహా మిగతా ప్రాంతాల్లో కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన ముస్లింలు అధికంగా ఉన్నారు. వీరు ఒవైసీల మాట ఎంతవరకు వింటారో ఓటింగ్ జరిగితే కానీ తేలేటట్టుగా లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికశాతం అధికార పార్టీ అభ్యర్థులే జయకేతనం ఎగురవేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో అదే ఆనవాయితీ వస్తుందా… గులాబీ గుబాలిస్తుందా నవంబరు 11వ తేదీ తర్వాత బయటపడనుంది.

