బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

  • మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు ఆమోదం
  • రెండో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు
  • బిల్లులను ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి సీతక్క పంచాయతీ రాజ్ లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. మంత్రి సీతక్క ముందుగా మున్సిపల్, తర్వాత పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. అనంతరం వాటి గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ప్రసంగిస్తూ ఆర్థిక అసమానతలు తొలగాలంటే ఉపాధి కూడా ఉండాలని పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉండటం వల్లే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బిల్లు తెచ్చామన్నారు. 2018లో పంచాయతీరాజ్ చట్టంలో 50 శాతం రిజర్వేషన్లపై సీలింగ్ పెట్టామని అన్నారు. ఏ రాష్ట్రంలో రిజర్వేషన్లపై సీలింగ్ విధిస్తూ చట్టాలు లేవని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న సీలింగ్ను సవరించేందుకు మళ్లీ బిల్లు ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన 50 శాతం సీలింగ్ను తొలగించే సవరణ కోసమే బిల్లు తీసుకువచ్చామన్నారు. ముందుగా తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధన సవరణ బిల్లుపై చర్చ జరిగింది. చర్చ జరుగుతున్నందున ఆర్డినెన్స్ కుదరదని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. సెషన్స్లో ఉన్నప్పుడు బిల్లు రూపంలో తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సీపెక్స్ సర్వే చేపట్టిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల సిఫారసుకు చర్యలు చేపట్టామన్నారు.

బీసీ వర్గాలకు ఇది చారిత్రాత్మక విజయం : మంత్రి సీతక్క

తెలంగాణ అసెంబ్లీలో బిసీ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఎక్స్ వేదికగా ఆసక్తిరమైన ట్వీట్ చేశారు. అందులో మా నాయకుడు రాహుల్ గాంధీ సూచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి క్రియాశీల నాయకత్వంలో తాము తెలంగాణ శాసన సభలో తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు-2025 ను గర్వంగా ప్రవేశపెట్టామన్నారు. ఈ బిల్లు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బిసిలు) కు 42 శాతం రిజర్వేషన్లను నిర్ధారిస్తుంది. గతంలో బిసిలు కేవలం 23శాతం రిజర్వేషన్లకు పరిమితం చేయబడ్డారని, ఇది వారి జనాభా నిష్పత్తిని ప్రతిబింబించలేదన్నారు. మన ప్రజా ప్రభుత్వం బిసిల వెనుకబాటుతనాన్ని అంచనా వేయడానికి ఇంటింటికీ సమగ్ర కుటుంబ సర్వే, శాస్త్రీయ కుల గణనను నిర్వహించింది. అంకితమైన కమిషన్ సిఫార్సుల ఆధారంగా, బిసిలకు 42శాతం రిజర్వేషన్లు అందించడానికి మేము తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 285 ఎని సవరించామన్నారు. ఈ బిల్లు కేవలం రిజర్వేషన్ల గురించి మాత్రమే కాదని, ఇది బీసీలకు సాధికారత కల్పించడం, వారి గొంతుకను వినిపించడం, స్థానిక పాలనలో వారి సరైన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం వైపు ఒక విప్లవాత్మక అడుగు అన్నారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడం బీసీ వర్గాలకు ఇది చారిత్రాత్మక విజయమని మంత్రి సీతక్క తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Updated On 1 Sept 2025 12:00 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story