Osmania University's allocation of professors' quarters to private individuals has drawn criticism

రాష్ట్రంలో మరో వివాదం రాజుకుంటోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ క్వార్టర్స్ను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం కొనసాగుతుండగానే.. ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) భూ వివాదం తెరపైకి వచ్చింది. విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ క్వార్టర్స్ను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారనే ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.

ఓయూ ప్రొఫెసర్లు విశ్వవిద్యాలయంలోని క్వార్టర్స్లో నివాసముంటే వారి వేతనం నుంచి నెలకు రూ. 40,000 కట్ చేస్తారని, అదే క్వార్టర్లను ప్రైవేటు వ్యక్తులకు కేవలం రూ. 1,000 కే ఇవ్వడాన్ని విద్యార్థి సంఘాలు తప్పు పడుతున్నాయి. బయట ఇదే సౌకర్యాలున్న ఇళ్లకు ఇందులో సగం చెల్లిస్తే సరిపోతుండటంతో ప్రొఫెసర్లు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో ఆ క్వార్టర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ ఖాళీలను పూరించడానికి వాటి ద్వారా కొంత ఆదాయాన్ని పొందడానికి కొందరు అధికారులు ఈ క్వార్టర్లను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించినట్లు చెబుతున్నారు. మార్కెట్ రేటుకు అనుగుణంగా కేటాయిస్తే ఉండటానికి అవకాశం ఉంటుందని ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రైవేటు వ్యక్తులకు క్వార్టర్స్ ఇవ్వడంపై ఓయూ వైస్ ఛాన్సలర్ ని విచారించగా.. క్వార్టర్లు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ కేటాయింపులు తన హయాంలో జరగలేదని.. గతంలో ఇన్ఛార్జి వీసీగా ఉన్న వ్యక్తి ఈ క్వార్టర్స్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ప్రస్తుత వీసీ వెల్లడించారు. మినిట్స్ బుక్లో ఈ విషయాన్ని తాను కూడా చూసినట్లు పేర్కొన్న ఆయన.. తనకు ఈ విషయంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వీసీ వివరణ పట్ల విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు క్వార్టర్స్ కేటాయించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వివాదం ఓయూ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని, సమగ్ర విచారణ జరిపి అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Politent News Web3

Politent News Web3

Next Story