స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల ప్రకటన కాంగ్రెస్‌ పార్టీలో దుమారం రేపింది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చేసిన ప్రకటనపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో చర్చించి మాట్లాడాల్సిన ఆంశాలను మీడియాతో పంచుకోవడం ఏంటని పీసీసీ చీఫ్‌ మండిపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ల ఆంశంతో ముడిపడి ఉన్నాయని, ఒకరి మంత్రిత్వ శాఖకు చెందిన విషయంపై మరొకరు మాట్లాడటం సరికాదని తీవ్రంగా స్పందించారు. కోర్టు పరిధిలోని విషయాలపై మాట్లాడటప్పుడు పార్టీ అనుమతి లేకుండా ఎలా మాట్లాడుతారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరును తప్పుపట్టారు.

పార్టీతో సంప్రదించకుండా ఏ ఒక్కరు కూడా అలాంటి ప్రకటనలు చేయవద్దని స్పష్టం చేశారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాట్లాడాలని.. సున్నితమైన అంశాలు, కోర్టు పరిధిలో అంశాలపై మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.

కాగా పార్టీ శ్రేణులను సన్నద్దం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పడం జరిగిందని మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. ఈనెలాఖరులో నోటిఫికేషన్ వస్తుందన్న మంత్రి పొంగులేటి మాత్రం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై స్పందించాల్సి ఉంది.

Politent News Web3

Politent News Web3

Next Story